మెక్సికో సిటీ: మెక్సికోలోని అట్లాకొముల్కోలో ఘోర రైలు ప్రమాదం (Train Accident) జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు పట్టాలు దాడుతుండగా గూడ్సు రైలు ఢీకొట్టింది. దీంతో పది మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో 61 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి బస్సు టాప్ పూర్తిగా ధ్వంసమైంది.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతుల్లో ఏడుగురు మహిళలలు, ముగ్గురు పురుషులు ఉన్నారని చెప్పారు. గాయపడినవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. రైలు వస్తున్నప్పటికీ పట్టాలు దాటేందుకు బస్సు డ్రైవర్ ప్రయత్నించడంతో ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు వెల్లడించారు. కాగా, 2023లో మెక్సికలో ఫెడరల్ హైవేలపై మొత్తం 12,999 ప్రమాదాలు జరిగాయి. 6400 మంది గాయపడగా, 1900 మంది మృతిచెందారు. గత ఫిబ్రవరిలో దక్షిణ మెక్సికోలో జరిగిన బస్సు ప్రమాదంలో 40 మంది దుర్మరణం పాలయ్యారు.