న్యూఢిల్లీ : తమ దేశంలోని దక్షిణ దీవులపై భూతల దాడులు జరిపితే యెమెన్‌లోని సాయుధ రాజకీయ, మతతత్వ గ్రూపు అన్సారుల్లా (హౌతీలు) బాబ్ అల్-మందబ్ జలసంధిని తమ నియంత్రణలోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉందని ఇరాన్ గురువారం హెచ్చరించింది. కాల్పుల విరమణకు విధించిన షరతులను ఇరాన్ తిరస్కరించిన పక్షంలో ఆ దేశంపై సైనిక చర్యను ఉధృతం చేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధంగా ఉన్నట్లు వైట్ హౌస్ నుంచి హెచ్చరిక వచ్చిన దరిమిలా ఇరాన్ నుంచి ఈ ప్రతిస్పందన వెలువడింది. ఇరాన్ భూభాగంపై భూతల దాడులకు దిగవద్దని అమెరికా-ఇజ్రాయెల్ దళాలకు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్సు కోర్(ఐఆర్జీసీ) హెచ్చరించింది.
యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉందని ఇరాన్ వార్తాసంస్థ తస్నీమ్ పేర్కొన్నది. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన మొదటి రోజు నుంచి అన్సారుల్లా పూర్తి అప్రమత్తంగా ఉందని, యుద్ధంలో దూకడానికి సిద్ధంగా ఉందని తస్నీమ్ వార్తా సంస్థ తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్ మీద ఒత్తిడి పెంచేందుకు వ్యూహాత్మక బాబ్ అల్-మండెబ్ జలసంధిని తమ నియంత్రణలోకి తీసుకుని హౌతీలు యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తారని వార్త సంస్థ పేర్కొన్నది. బాబ్ అల్-మండెబ్ అనేది హొర్ముజ్ జలసంధి తర్వాత ఒక ముఖ్యమైన జలసంధి. ఇది ఎర్ర సముద్రం(రెడ్ సీ), గల్ఫ్ ఆఫ్ ఏడెన్ మధ్య ఉంది. ప్రపంచంలోని ప్రధాన వాణిజ్య సముద్ర మార్గాల్లో ఒకటిగా ఇది పేరుపొందింది. శత్రువును కట్టడి చేసేందుకు బాబ్ అల్-మండెబ్ జలసంధిని నియంత్రణ చేయడం ఇరాన్‌కు అవసరం.