America | కేన్సాస్ సిటీ : అమెరికాలో మరోమారు తుపాకులు విరుచుకుపడ్డాయి. స్పోర్ట్స్ పరేడ్లో రక్తపుటేరులు పారాయి. సూపర్ బౌల్ విజేతగా నిలిచినందుకు కేన్సాస్ సిటీ చీఫ్స్ పరేడ్ నిర్వహిస్తుండగా కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. మిస్సౌరిలోని కేన్సాస్ సిటీలో ఈ కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ పరేడ్లో వేలాది మంది పాల్గొనడంతో.. ఎటునుంచి కాల్పులు జరుగుతున్నాయో తెలియక అక్కడికి వచ్చిన వారు పరుగులు పెట్టారు. కాల్పుల్లో గాయపడ్డ వారిని పోలీసులు సమీప ఆస్పత్రులకు తరలించారు.
కాల్పులకు పాల్పడ్డ ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు కేన్సాస్ సిటీ పోలీస్ చీఫ్ స్టేసీ గ్రేవ్స్ మీడియాకు వెల్లడించారు. కాల్పులకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఆటగాళ్లు, కోచ్లు, సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు కేన్సాస్ జట్టు ప్రకటించింది. సూపర్ బౌల్ ఛాంపియన్షిఫ్ అనేది అమెరికా నేషనల్ ఫుట్బాల్ లీగ్లో భాగం. గత ఆదివారం జరిగిన మ్యాచ్లో కేన్సాస్ జట్టు శాన్ఫ్రాన్సిస్కోపై నెగ్గింది. దీంతో ఆ జట్టు విజయోత్సవాలను నిర్వహించింది. ప్రతి ఏడాది సూపర్ బౌల్ ఛాంపియన్షిప్ జరుగుతుంది.