మేడ్చల్, మే 16(నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశంలో బీఆర్ఎస్, బీజేపీ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశం గురువారం జడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని,
ధాన్యం కొనుగోళ్లను ఆలస్యం చేస్తున్నారని, దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ప్రజా ప్రతినిధులు అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి సౌకర్యాలు లేక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. జడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి జోక్యం చేసుకుని రైతులకు ఇబ్బందుల జరగకుండా తక్షణమే కొనుగోళ్లు చేపట్టాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజేందర్‌కు ఆదేశించారు. రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలని జడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి సూచించారు.
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని వివిధ ప్రాంతాలలో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని డీపీవోను జడ్పీటీసీ, ఎంపీపీ సభ్యులు ప్రశ్నించారు. నిరుపేదలకు సంబంధించిన నిర్మాణాలను కూల్చివేస్తున్నారే తప్ప కొందరి ప్రజాప్రతినిధుల అండ దండలున్న వారి నిర్మాణాలను కూల్చి వేయడం లేదని ఆరోపించారు. దీనిపై స్పందించిన జడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చి చర్యలు తీసుకునేలా చేద్దామన్నారు.
ఆరు నెలలుగా గ్రామ పంచాయితీ సిబ్బందికి జీతాలు చెల్లించక పోవడంతో పారిశుధ్యం కొరవడుతుందని సభ్యులు ఆరోపించారు. సిబ్బందికి జీతాలు చెల్లికపోవడంతో గ్రామీణ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందన్నారు. వెంటనే గ్రామ పంచాయితీ సిబ్బందికి జీతాలు చెల్లించాలని జడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి అధికారులకు ఆదేశించారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్ జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
చిక్కడపల్లి, మే 16: రైతులు పండించే అన్ని రకాల వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్ రావు, తీగల సాగర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిందన్నారు. ఇప్పుడు కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం విడ్డూరంగా ఉన్నదని అన్నారు. వడ్లు పండించే రైతులలో 80 శాతం దొడ్డు వడ్లు, 20 శాతం సన్న వడ్లును పండిస్తున్నారని వివరించారు. ఇందులో అత్యధికం సన్న చిన్నకారుల రైతులే ఉన్నారని తెలిపారు. బోనస్ చెల్లించని పక్షంలో రైతులను కూడగట్టుకొని పోరాటం చేస్తామని హెచ్చరించారు.