సిటీబ్యూరో, మే 9(నమస్తే తెలంగాణ): మిట్ట మధ్యాహ్నం.. నగర ప్రజలు ఓ అద్భుతమైన ఖగోళ దృశ్యానికి ప్రత్యక్ష సాక్షులయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం 12:12 గంటలకు నగరంలో ‘జీరో షాడో డే’ నమోదైంది. ఈ సమయంలో నిటారుగా ఉన్న వస్తువులకు ఎలాంటి నీడ కనిపించకపోవడం విశేషం. ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక కార్యదర్శి ఎన్. శ్రీ రఘునందన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..‘సూర్యుడు మన తలపైకి వచ్చినప్పుడు సూర్య కిరణాలు నేరుగా భూమిని తాకుతాయి.
దీంతో నిటారుగా ఉన్న వస్తువుల నీడలు పడవు. భూమి 23.5 డిగ్రీల వాలుతో ఉండటంతో.. సూర్యుడు సంవత్సరాంతర కాలంలో వివిధ మార్గాల్లో తిరుగుతుంటాడు. అందుకే కొన్ని ప్రాంతాల్లో ఈ జీరో షాడో డే రెండుసార్లు వస్తుంది’ అని పేర్కొన్నారు. తిరిగి ఈ ఏడాది ఆగస్టులో తెలంగాణ, ఏపీలో మరోసారి జీరో షాడో డే ఉంటుందని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా పేర్కొంది.