కేపీహెచ్‌బీ కాలనీ, డిసెంబర్ 10 : ఆరోగ్యమే మహాభాగ్యమని.. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ కాలినడక, వ్యాయామం, యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శనివారం కేపీహెచ్‌బీ కాలనీ డివిజన్లోని శ్రీలాపార్కు ప్రైడ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 3హెచ్(హ్యాపీ, హెల్దీ, హ్యాపనింగ్) నినాదంతో 5కే రన్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుర్మయ్యగారి కొండల్రావు, మియాపూర్ ఏసీసీ కృష్ణప్రసాద్, సీఐ తిరుపతిరావు, ట్రాఫిక్ ఏసీపీ హన్మంతరావు, సీఐ సుమన్, ల్యాండ్ మార్క్ వైద్యశాల నిర్వాహకుడు సుధీర్‌రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నగరంలో నివసిస్తున్న ప్రతిఒక్కరూ ఆరోగ్యవంతులుగా జీవించాలంటే మితాహారంతోపాటు కాలినడక, వ్యాయామం, యోగా, ఆటలకు సమయాన్ని కేటాయించాలన్నారు.ఈ పోటీల్లో మహిళలు, చిన్నారులు, యువకులు ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమన్నారు. అందరికీ ఆరోగ్యం.. అన్న నినాదంతో 5కే రన్ పోటీలను నిర్వహించిన వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు. పోటీల్లో 1000 మంది యువకులు, మహిళలు, చిన్నారులు పాల్గొని.. ఆట పాటలతో సందడి చేశారు. కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లూరి మురళీ, సభ్యులు ఉన్నారు.