కందుకూరు, జూన్ 28 : బెంగుళూర్లోని అగ్నివీర్ శిక్షణ సెంటర్ నుంచి ఓ యువకుడు అదృశ్యమయ్యారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం, బేగంపేట్ గ్రామానికి చెందిన దయ్యాల సతీశ్(20) ఇంటర్ చదివాడు. 2024, మార్చిలో అగ్నివీర్‌కు ఎంపికయ్యాడు. ఏప్రిల్ మాసంలో శిక్షణ కోసం కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో గల ది మద్రాస్ సాపర్‌ను, హెచ్‌క్యూ మెగ్ అండ్ సెంటర్‌కు వెళ్లాడు. రెండు మాసాలుగా అక్కడ శిక్షణ పొందుతున్నాడు. కాగా.. నాలుగు రోజుల నుంచి అక్కడి నుంచి అదృశ్యం అయ్యాడు. తాను చనిపోతున్నట్లు స్నేహితులకు మెసేజ్ పంపినట్లు తల్లిదండ్రులు తెలిపారు.
శారీరకంగా, మానసికంగా ఓ సారు తనను ఇబ్బందులు గురి చేస్తున్నాడని మెసేజ్‌లో పెట్టినట్లు తెలిసింది. ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. విషయం తెలిసిన వెంటనే శనివారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి, స్థానిక ఎంపీటీసీ బాల్లాజ్, పీఏసీఎస్ డైరెక్టర్ గౌర పర్వతాలు వారి ఇంటికి వెళ్లి పరామర్శించిన అనంతరం ధైర్యం చెప్పారు. బెంగళూరులో తప్పిపోయిన సతీశ్ ఆచూకీ కోసం ప్రయత్నం చేస్తామని వారికి హామీ ఇచ్చారు.