జీడిమెట్ల, మార్చి 30: చదువుకోవడం ఇష్టం లేక మనస్థాపంతో ఓ యువకుడు ఫ్లై ఓవర్ ఫుట్‌పాత్‌పైకి ఎక్కి దూకడంతో తీవ్ర గాయాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం… ములుగు జిల్లా వాజేడు మండలం గుమ్మడి దొడ్డి పంచాయతీ సుందరయ్య కాలనీకి చెందిన అల్లి రాంబాబుకు ముగ్గురు సంతానం. మూడవ కుమారుడు అల్లి సాయి ప్రకాశ్(20) భద్రాచలంలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. సాయి ప్రకాశ్‌కు చదువుకోవడం అంతగా ఇష్టం లేకపోవడంతో గత నెల రోజుల కిందట కాలేజీ నుంచి ఇంటికి వచ్చి చదువుకోనని, ఏదైనా ఉద్యోగం చేస్తానని చెప్పాడు.
తండ్రి మంచిగా చదువుకోవాలని బతిమిలాడాడు. వినకపోవడంతో గత 20 రోజుల కిందట హైదరాబాద్‌కు వెళ్తున్నానని, అక్కడ ఏదైనా ప్రైవేటు ఉద్యోగం చేస్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరి వెళ్లాడు. తన కొడుకు జాడ తెలుసుకుని ఈనెల 29న హైదరాబాద్‌కు చేరుకుని జీడిమెట్ల ప్రాంతానికి వచ్చాడు. కొడుకును కలుసుకుని మంచిగా చదువుకోవాలని మరోసారి బతిమిలాడటంతో తాను రానని మొండికేశాడు. తనను ఎలాగైనా ఇంటికి తీసుకెళ్తారనే భయంతో తన నుంచి దూరంగా పరిగెత్తుతూ ఫ్లై ఓవర్ ఫుట్‌పాత్‌పై నుంచి రోడ్డు మీదికి దూకాడు. దీంతో తలకు బలమైన గాయం కావడంతో వెంటనే సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.