జగద్గిరిగుట్ట, అక్టోబర్13 : పాత గొడవల నేపథ్యంలో యువకుడు దారుణహత్యకు(Brutal murdered) గురయ్యాడు. జగద్గిరిగుట్ట(Jagadgirigutta) సీఐ నరసింహ, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా బుదేర ప్రాంతానికి చెందిన అక్బర్‌బాషా కుటుంబం జగద్గిరిగుట్ట సమీపం దీనబంధు కాలనీలో నివాసముంటున్నది. ఇతని కుమారుడు నదీంపాషా(21) బ్యాండుమేళం కార్మికుడిగా పనిచేస్తాడు. ఇతనికి అదేప్రాంతానికి చెందిన కొందరితో గొడవలున్నాయి. ఈనేపథ్యంలో దీనబంధుకాలనీలో నదీంపాషాపై ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.
తప్పిచుకుని పారిపోతున్న బాధితున్ని ఇనుప రాడ్లతో తలపైకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సంఘటనాస్థలంలోనే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. మృతుని సోదరి ఆయేషా పలువురిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, హత్యకు కారకులుగా భావిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలులుస్తున్నది.