Hyderabad | హైదరాబాద్ : మాజీ ప్రియుడిని గంజాయి కేసులో ఇరికించేందుకు ఓ యువతి కుట్ర చేసింది. కొన్నాళ్లుగా తనను దూరం పెడుతున్నాడనే కోపంతోనే గంజాయి కేసులో అతన్ని ఇరికించేందుకు యువతి కుట్ర చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
రింకీ అనే యువతి.. శ్రవణ్ అనే యువకుడిని కొన్నేండ్ల నుంచి ప్రేమిస్తోంది. కానీ అతను కొంతకాలం నుంచి రింకీని దూరంగా పెడుతున్నాడు. దీంతో రూ. 4 వేలు పెట్టి 40 గ్రాముల గంజాయిని కొనుగోలు చేసిందామె. ఆ తర్వాత తన స్నేహితులతో కలిసి మాజీ ప్రియుడు శ్రవణ్‌ను రింకీ పిలిపించింది. ఆ యువకుడికి తెలియకుండా అతని కారులో గంజాయి ప్యాకెట్లు పెట్టింది. 5 గ్రాముల చొప్పున 8 ప్యాకెట్లను ఉంచింది.
ఆ తర్వాత అదే కారులో అందరూ కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌కు వెళ్లారు. అందరూ పబ్‌లో ఉండగా జూబ్లీహిల్స్ పోలీసులకు రింకీ ఫోన్ చేసి.. శ్రవణ్ అనే యువకుడు గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిపింది. క్షణాల్లో పబ్ వద్దకు చేరుకున్న పోలీసులు.. గంజాయి ఫిర్యాదుపై ఆరా తీశారు. దర్యాప్తు చేసి రింకీ సహా ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 40 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, రింకీ లా స్టూడెంట్ అని తేలింది.