Hyderabad | బండ్లగూడ, ఏప్రిల్ 11: ఆన్లైన్ గేమ్‌లో డబ్బులు పోగొట్టుకున్న ఓ యువతి.. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పేందుకు భయపడి.. ఇంట్లో దొంగతనం జరిగిందంటూ హైడ్రామా ఆడింది. చోరీ జరిగినట్లు రత్తికట్టించేలా.. ఇంట్లోని వస్తువులనూ చిందరవందర పడేసింది. చివరికి పోలీసులకు దొరికిపోయింది. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలివి.. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఎర్రబోడలో నివాసముంటున్న డిగ్రీ చదువుతున్న ఓ యువతి గురువారం ఉదయం.. మా ఇంట్లో ముసుగులు ధరించిన దుండగులు దొంగతనానికి పాల్పడినట్లు స్థానిక మీడియా ప్రతినిధులకు తెలిపింది. దీంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు.
పోలీసులు, మీడియా వివరాలు సేకరించగా.. ఇంట్లోకి చొరబడిన దుండగులు బీరువాలో రూ. 25వేలు ఎత్తుకెళ్లినట్లు సదరు యువతి తెలిపింది. తాను వాష్‌రూమ్‌కు వెళ్లే వచ్చే సరికి చోరీ జరిగినట్లు నమ్మించింది. అనుమానం రాకుండా ఇంట్లోని వస్తువులను సైతం చిందరవందపడేసింది. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఆ యువతిపై అనుమానం వచ్చింది. ఆమెను విచారించగా, అసలు విషయం చెప్పింది. ఆన్లైన్ గేమింగ్‌లో రూ. 25 వేలు పోగొట్టుకున్నట్లు తెలిపింది. డబ్బుల గురించి తల్లిదండ్రులు అడిగితే ఏమి చెప్పాలో తెలియక.. భయంతో దొంగతనం జరిగినట్లు నాటకం అడినట్లు తెలిపిందని పోలీసులు చెప్పారు. ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి విడిచిపెట్టినట్టు తెలిపారు.