జీడిమెట్ల, జూలై 25: విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన ఓ యువతి ప్రియుడితో కలిసి దొంగతనాల బాట పట్టింది. పోలీసులకు చిక్కి ఓ సారి జైలుకు వెళ్లింది. బెయిల్‌పై వచ్చిన నెల రోజులకే తిరిగి మరో దొంగతనం చేసి కటకటాల పాలైంది. శుక్రవారం బాలానగర్ జోన్ డీసీపీ కే.సురేశ్‌కుమార్ ఈ కేసు వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్ జిల్లా పిప్రోలి గ్రామానికి చెందిన బేబీ అలియాస్ అరోహి(21) కొన్నేండ్ల కింద నగరానికి వచ్చి సనత్‌నగర్‌లోని మధురానగర్‌లో ఉంటూ సేల్స్‌గర్ల్‌గా పని చేస్తున్నది. వస్తువులు అమ్ముతున్నట్లు నటిస్తూ దొంగతనానికి వీలుగా ఉన్న ఇండ్లను గుర్తించేది.
బేబీకి మూడేండ్ల క్రితం కర్నాటకకు చెందిన బచల్కర్ ఫ్రాంక్లిన్‌తో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. ఈ స్నేహం ప్రేమగా మారగా.. వారు విలాస జీవితానికి అలవాటు పడ్డారు. చెట్టాపట్టాలేసుకొని ఆయా ప్రాంతాలు తిరిగేవారు. అయితే ఖర్చుల కోసం బేబీ దొంగతనాలు చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో ఈ నెల 18న జగద్గిరిగుట్ట ఆల్విన్‌కాలనీకి చెందిన విప్పర్తి చిరంజీవి ఇంటికి తాళం వేసి ఉండగా అరోహి గమనించింది. షూ స్టాండ్‌లోని హెల్మెట్ కింద దాచిన తాళం చెవితో ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో ఉన్న 22.3 తులాల బంగారం, ఐదు తులాల వెండి నగలు ఎత్తుకెళ్లింది.
చిరంజీవి సాయంత్రం వచ్చి ఇంట్లో దొంగతనం జరిగిందని గ్రహించి జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నెల రోజుల క్రితం బెయిల్‌పై విడుదలైన అరోహి ఈ దొంగతనం చేసిందని గుర్తించి 22.3 తులాల బంగారం, ఐదు తులాల వెండి నగలు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో బాలానగర్ ఏసీపీ పింగళి నరేశ్‌రెడ్డి, జగద్గిరిగుట్ట సీఐ నర్సింహ, డీఐ నరేంద్రారెడ్డి, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రవికుమార్‌లు ఉన్నారు.