మూసాపేట మే 2: మద్యం మత్తులో జరిగిన దాడిలో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందిన ఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్టకు చెందిన ధనుశ్ గౌడ్ (21) అభినవ్ గౌడ్ నాగిరెడ్డి వీరు ముగ్గురు అవినాశ్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. గత నెల 5వ తేదీన సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో కూకట్పల్లి దారువాల వైన్స్ లో మద్యం తాగడానికి వెళ్లారు.
అప్పటికే మద్యం తాగి ఉన్న మూసాపేటకు చెందిన కావటి కేశవ్‌తో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో కావటి కేశవ్.. ధనుశ్, అభినవ్, నాగిరెడ్డి పై పిడిగుద్దులతో విరుచుకుపడగా ముగ్గురు అక్కడి నుంచి పారిపోయారు. మరుసటి రోజు ఉదయం ధనుశ్కు తీవ్ర కడుపునొప్పి రావడంతో స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. మెరుగైన చికిత్స నిమిత్తం నగరంలోని నిమ్స్ దవఖానకు తరలించారు. ధనుశ్ కడుపులో పెద్ద పేగు పగిలి ఇన్ఫెక్షన్ రావడంతో వైద్యులు సర్జరీ చేశారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.