Photo Shoot | జవహర్‌నగర్, మార్చి 9: జవహర్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఫొటో షూట్ కోసం సరదాగా మల్కారం గుట్టలకు వచ్చిన నలుగురు యువకుల్లో ఓ యువకుడు క్వారీ గుంతలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. ఈ సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్‌నగర్ కార్పొరేషన్‌లోని మల్కారం గుట్టలకు సమీపంలో భారీ క్వారీ గుంత ఉండటంతో సికింద్రాబాద్ తిరుమలగిరి ప్రాంతానికి చెందిన ఎతిన్ నాయుడు (20) మరో ముగ్గురు మిత్రులతో కలిసి సరదాగా మల్కారం గుట్టలపైన ఫొటోషూట్‌కు వచ్చారు.
ఎతిన్ నాయుడు సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. ఆదివారం కావడంతో సరదాగా స్నేహితులతో కలిసి జవహర్‌నగర్‌లోని మల్కారం గుట్టలపైన ఫొటో షూట్ తీసుకుందామని ఆనందతో వచ్చారు. గుట్టలపైన ఎతిన్ నాయుడు రీల్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తు క్వారీ గుంతలో పడ్డాడు. ఈత రాకపోవడంతో ఎతిన్ నాయుడు నీటిలో మునిగి గల్లంతయ్యాడు. వెంటనే స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లు, డీఆర్ఎఫ్ బృందాల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం రాత్రి కావడంతో మృతదేహాన్ని వెలికితీయడానికి సాధ్యం కాలేదు. ఈ విషయమై పోలీసులను వివరణకోరగా ఫిర్యాదు అందలేదని తెలిపారు.