Accident | ఆదిభట్ల, మే 16: హైదరాబాద్ శివారు ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నెగూడ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల సమీపంలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
ఆదిభట్ల ఎస్సై నోయల్ రాజ్ వివరాల ప్రకారం.. గుర్రం జగదీశ్వర్ రెడ్డి బొంగుళూరు నుంచి తుర్కయాంజల్ వైపు తన స్విఫ్ట్ కారులో వెళ్తుండగా మార్గమధ్యలో ఇంధనం అయిపోయింది. అదే సమయంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పంగా దీక్షిత్ రెడ్డిని లిఫ్ట్ అడిగాడు. ఇద్దరూ కలిసి హస్తినాపురంలోని ఓ పెట్రోల్ బంకుకు వెళ్లగా అది మూసి ఉండటంతో తిరిగి బొంగుళూరు వైపు బయలుదేరారు. ఈ క్రమంలో మన్నెగూడ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల సమీపానికి రాగానే ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న జగదీశ్వర్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సమాచారం ఇవ్వడంతో 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతదేహాన్ని ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ద్విచక్ర వాహనం నడుపుతున్న దీక్షిత్ రెడ్డికి స్వల్ప గాయాలవడంతో వనస్థలిపురంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.