Narsingi | మణికొండ, మార్చి 3 : నార్సింగిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువకుడిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తిని కొవ్వూరి శ్రీనివాస్గా గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెరుగుతున్న హిట్ అండ్ కేసులు
గత కొన్ని రోజులుగా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. వారం రోజలు కిందట కూడా ఔటర్ రింగ్ రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. అదేవిధంగా నార్సింగి చౌరస్తాలోని రేడియల్ రోడ్డుపై అతివేగంతో అజాగ్రత్తగా వాహనం నడపడంతో ఒక వ్యక్తిని బలిగొన్నారు. ఇలా వరుసగా హిట్ అండ్ రన్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంటున్నా.. నార్సింగి ట్రాఫిక్ పోలీసులు అతి వేగాన్ని నియంత్రించడంలో పూర్తిగా విఫలమయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వాహనాలకు ఛలాన్లు అంటూ ఉన్నతాధికారులు ఇచ్చిన టార్గెట్లపైనే పోలీసులు ఫోకస్ చేస్తున్నారు తప్ప.. అతివేగాన్ని నియంత్రించడంలో పట్టనట్లుగా వ్యవహరిస్తుండటం కారణమని విమర్శించారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సకాలంలో స్పందించి రహదారులపై చోటుచేసుకుంటున్న ప్రమాదాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.