మాదాపూర్, మే 31: తల్లి పుట్టిన రోజును పురస్కరించుకుని ఓ యువకుడు స్నేహితులతో కలిసి మద్యం తాగుతున్నాడు.. అదే సమయంలో మరో వ్యక్తి స్నేహితులతో వచ్చి మందు, డబ్బులు కావాలని అడుగగా.. ఇవ్వనని చెప్పాడు. ఆవేశంతో వారు కత్తులతో ఆ యువకుడిని పొడవగా మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రి మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది.
సీఐ కృష్ణమోహన్ తెలిపిన కథనం ప్రకారం… మణికొండకు చెందిన జయంత్ గౌడ్ .. శుక్రవారం తన తల్లి లక్ష్మి పుట్టిన రోజు కావడంతో కేక్ కోసం రాత్రి 10 గంటల సమయంలో స్నేహితులతో కలిసి కొండాపూర్‌కు వచ్చి కేకును తీసుకొని వేడుకలు జరుపుకున్నారు. అనంతరం ఏడుగురు స్నేహితులతో కలిసి అతను హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్ వెనకవైపు ఉన్న నిర్మానుశ్య ప్రాంతంలో మద్యం తాగుతున్నారు. రాత్రి 1:30 గంటల సమయంలో గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు వచ్చి కత్తులతో బెదిరించి మద్యం బాటిల్, డబ్బులు అడిగారు.
దీనికి జయంత్ గౌడ్ నిరాకరించగా వారిమధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కోపానికి గురైన దుండగులు జయంత్ గౌడ్‌ను కత్తులతో పొడిచి పరారయ్యారు. రాత్రి 1:30 గంటకు డయల్ 100 నుంచి సమాచారం అందుకున్న పోలీసులు తీవ్ర గాయాలతో ఉన్న జయంత్ గౌడ్‌ను యశోద హాస్పిటల్ కి తీసుకురాగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. జయంత్గౌడ్పై ఇది వరకే బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో హత్య కేసు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు.