యాదాద్రి, ఆగస్టు 14 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య క్షేత్రం ఆదివారం భక్తులతో పులకించింది. స్వయంభువులను దర్శించుకొనేందుకు భక్తులు క్యూ కట్టారు. ఆలయ ప్రాకారాలు, మండపాలు, అష్టభుజి ప్రాకారాల్లో నిర్మించిన దేవతామూర్తులు, సింహాకృతులు, వివిధ ప్రతిమలను చూసి భక్తితో తన్మయత్వం చెందారు.
వరుస సెలవులతోపాటు ఆదివారం శ్రావణమాసం బోనాల జాతర కావడంతో స్వామివారిని దర్శించుకొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కొండకింద కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణిలోనూ భక్తుల రద్దీ కన్పించింది.
కొండకింద పాతగోశాల వద్ద వ్రత మండపంలో సత్యనారాయణస్వామి వ్రతాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సుమారు 42 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. అన్ని విభాగాలు కలుపుకొని ఖజానాకు రూ.43,65,662 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు.