‘కరార విందేన పదార విందం ముఖారవిందేన విని వేశ యంతు వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి’ అని మహాభాగవతంలో వటపత్రశాయి గురించి విశిష్టంగా చెప్పడం జరిగింది. పూర్వం ప్రళయాంత కాలంలో స్వామి సృష్టిని తిరుగోమనం చేయడం కోసం సంకల్పించినప్పుడు స్వామి 14 లోకాలను చిన్న నిష్కమాత్ర ప్రమాణం ద్వారా గర్భంలో నిక్షిప్తం చేసుకుని మర్రి ఆకుపై పవళించినటువంటి దృశ్యమే వటపత్రశాయి రూపం అని ఆలయ ప్రధానార్చకుడు నల్లన్‌థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు. ఇది కేవలం ఒక మార్కండేయ మహర్షి మాత్రమే దర్శించారు. అలాంటి అపురూప దర్శనం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం ఉదయం సాక్షాత్కారమైంది.
– యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 24
వటపత్రశాయి సేవలో పాల్గొన్న గవర్నర్
యాదగిరిగుట్ట ఆలయ పునఃప్రారంభానంతం తొలిసారిగా జరిగిన బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్‌రాజన్ పాల్గొన్నారు. ఉదయం 9గంటలకు యాదగిరి కొండపైకి చేరుకున్న గవర్నర్ స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం స్వామివారి అలంకార సేవలో గవర్నర్ పాల్గొన్నారు. వటపత్రశాయి అలంకారంలో స్వామివారు తిరుమాఢవీధుల్లో ఊరేగగా.. గవర్నర్ స్వామివారి సేవ ముందు నడిచారు. తిరుమాఢవీధుల చుట్టూ తిరుగుతూ భక్తిపారవశ్యం పొందారు. వేంచేపు మండపంలో జరిగిన అలంకార విశిష్టతను ఆలకించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు గవర్నర్‌కు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం వేంచేపు మండపంలో గవర్నర్‌కు ఆలయ ప్రధానార్చకుడు చతుర్వేద ఆశీర్వచనం చేసి, లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈఓ ఎన్.గీత, డీఈఓ దోర్బల భాస్కర్‌శర్మ, ఆలయ ప్రధానార్చకులు నల్లన్‌థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు పాల్గొన్నారు.
సాయంత్రం హంస వాహన సేవ
దేవదేవుడు తన మనోనేత్రంతో లోకంలోని మంచి, చెడులను వేరు చేసే విధానికి ప్రతీకగా.. పాలను, నీటిని వేరు చేయగల హంస దివ్య వాహనంగా స్వామివారు భక్తజనులకు శుక్రవారం రాత్రి దర్శనమిచ్చారు. రాత్రి 7గంటలకు నిత్య కైంకర్యాల అనంతరం నారసింహుడిని ప్రధానాలయంలోని కల్యాణ మండపంలో దివ్యమైన అలంకారంతో హంస వాహనంపై అధిష్ఠింపజేసి ప్రధానాలయ తిరుమాఢవీధుల్లో ఊరేగించారు. హంస వేదస్వరూపం, జ్ఞానాత్మకమైన వేద ప్రాముఖ్యంగా ఉన్న హంస వాహన సేవను ఆగమశాస్త్రరీతిలో ఆలయ ప్రధానార్చకులు నిర్వహించారు.
శ్రీమహావిష్ణువు ధరించిన అద్భుత రూపమే వటపత్రశాయి
సృష్టి ఆదిలో శ్రీమహావిష్ణువు ధరించిన అద్భుత రూపమే వటపత్రశాయి అలంకారం. మహాకల్ప ముందు ప్రపంచమంతా జలమయమై, అంధకారమై ఉన్న సమయంలో భగవానుడు మర్రి ఆకుపై పవళించి తన గర్భంలోని లోకాలన్నింటికీ తన పాదారవిందం చేత నోటి ద్వారా అమృతాన్ని అందిస్తూ కాపాడిన శ్రీమన్నారాయణ తత్వం ఈ అలంకార సేవలో దర్శించవచ్చునని ఆలయ ప్రధానార్చకుడు నల్లన్‌థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు. సర్వలోక రక్షకుడిని తానేనని స్వామివారు ఈ అలంకార సేవలో భక్తులకు దర్శన భాగ్యం కలిగించాడని అన్నారు. ఈ లీలలో సమస్త చరాచర సృష్టి మండలాన్ని నిర్మించే తీరు దర్శించవచ్చునని అర్చకులు వివరించారు.
రాజహంసగా.. పరమాత్మ వాహనంగా…
పురాణ ఇతిహాసంలో, వేద శాస్త్రంలో హంసను జ్ఞానానికి ప్రతీకగా పేర్కొన్నారు. హంస శాంతికి, కీర్తికి, ఆనందానికి, అందానికి ప్రతీక. హంస పక్షి జాతికి చెందిన భగవదనుగ్రహ విశేషం వల్ల రాజహంసగా పరమాత్మ వాహనంగా ఆగమశాస్ర్తానుసారంగా నిర్వహింపబడుటకు యోగ్యతను కలిగి ఉన్నదని ఆలయ అర్చకులు తెలిపారు. జ్ఞానం మాత్రమే కాకుండా జ్ఞాన శబ్ధవాచ్చుడైన భగవంతుడిని పొందవలెనని శుద్ధ, సత్య గుణ ప్రతీకమైన తెల్లని హంస వాహనం సూచిస్తుందన్నారు. సాధారణంగా కైవల్యం జ్ఞానం వల్లే లభించునని, అట్టి జ్ఞానం శుద్ధసత్వగుణ ప్రవృత్తిని కలిగిన నాడు జీవుడు పొందగలడని ఈ హంస వాహనం అధిరోహించి పరమాత్మ ప్రత్యక్షంగా భక్తకోటికి అనుగ్రహించుట ఎంతో ముక్తి ప్రదమైనదని వివరించారు.
నేడు శ్రీకృష్ణాలంకారంలో లక్ష్మీనరసింహుడు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో శనివారం స్వామివారు శ్రీకృష్ణాలంకార సేవలో (మురళీకృష్ణుడు) భక్తులకు దర్శనమివ్వనున్నారు. సాయంత్రం పొన్న వాహన సేవలో ఊరేగనున్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
సాయంత్రం ప్రధానాలయం వద్ద నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వైటీడీఏ ఆధ్వర్యంలో డాక్టర్ అలేఖ్య పుంజాల బృందం ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య ప్రదర్శన, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అన్నమాచార్య ప్రాజెక్టు వారితో అన్నమాచార్య సంకీర్తనలు భక్తులను ఎంతగానో
ఆకట్టుకున్నాయి.