WTITC | సిటీబ్యూరో, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): రెండు తెలుగు రాష్ర్టాల్లో ఐటీ రంగం అభివృద్ధికి వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్ (డబ్ల్యూటీఐటీసీ) పనిచేస్తోందని చైర్మన్ సందీప్ మక్తల తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐటీ ఉద్యోగులను కలిసి వారితో తెలుగు రాష్ర్టాల్లో ఐటీ రంగానికి మేలు చేసేందుకు ఉన్న అవకాశాలను గుర్తించే కార్యక్రమంలో భాగంగానే ఆదివారం ఆఫ్రికా డబ్ల్యూటీఐటీసీ సమ్మిట్‌ను నిర్వహించామన్నారు.
దక్షిణాఫ్రికాలోని భారత కౌన్సిల్ కార్యాలయంలో కౌన్సిల్ జనరల్‌తో డబ్ల్యూటీఐటీసీ బృందం సమావేశమై ఇరు దేశాల మధ్య టెక్నాలజీ అంశాల్లో సమన్వయం, వ్యాపార అంశాల్లో పరస్పర ప్రయోజనాలు, నూతన వ్యాపార అవకాశాల అన్వేషణ వంటివి చర్చించామన్నారు. సమావేశంలో డబ్ల్యూటీఐటీసీ ప్రతినిధులు కిశోర్ పుల్లూరి, నాగరాజ్ గుర్రాల, రెలాన్ రంజన్, ప్రవీణ్ మీరెడ్డి, వెంకట్ ఓరుగంటి, జయదీప్, విక్రాంత్మూల, తుమ్మల గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.