ఖైరతాబాద్, ఆగస్టు 3: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పదేపదే జర్నలిస్టులపై ఇష్టానుసారం మాట్లాడుతూ.. తన హుందాతనాన్ని కోల్పోతున్నారని సీనియర్ జర్నలిస్టులు విమర్శించారు. ఆ జర్నలిస్టులు, డిజిటల్ మీడియా లేకుంటే సీఎం పదవి దక్కేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏది జర్నలిజం.. ఎవరు జర్నలిస్టు’ అంశంపై ఆద్య టీవీ సీఈవో సరిత అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి బట్టలు ఊడదీసి కొడుతానంటూ వ్యాఖ్యానిస్తుండం, జర్నలిస్టుల చెంపలపై కొడతా అనడం.. ఆయనలోని ఫ్రస్టేషన్‌ను తెలియజేస్తుందని ఎద్దేవా చేశారు. ఇటీవల జరిగిన ఓ సభలో ఎదురుగా ఉన్న జర్నలిస్టులను ఉద్దేశించి కాళ్ల మీద కాళ్లు వేసుకొని కూర్చునే వారిని చూస్తే చెంప పగులగొట్టాలనిపిస్తుందంటూ వ్యాఖ్యానించారని, సీఎం ప్రెస్‌మీట్‌కు వెళ్లే జర్నలిస్టుకు ఏ అర్హత ఉండాలో.. ఆయనే చెప్పాలని సూచించారు. సీఎం వార్తలను కవర్ చేసే విలేకరులందరికీ 15, 20 సంవత్సరాల అనుభవం ఉంటుందని స్పష్టం చేశారు.
జర్నలిస్టులు రాసిన కథనాల వల్ల సీఎం పదవి దక్కించుకున్న వ్యక్తి ఇలా మాట్లాడటం సిగ్గు చేటని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఒకలాగా అధికారంలోకి రాగానే మరోలా మాట్లాడటం రేవంత్‌రెడ్డి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తున్నదన్నారు. అధికారంలో లేనప్పుడు జర్నలిస్టులను ప్రశంసించి, అధికారంలోకి రాగానే జర్నలిస్టులను విమర్శించడమే మీ వైఖరా? అని నిలదీశారు. రేవంత్‌రెడ్డి కంటే సీనియర్లకు సీఎంగా అవకాశం దక్కలేదని.. మీడియా ప్రభావం వల్లే ఆయన ముఖ్యమంత్రి అయ్యారన్న విషయాన్ని మర్చిపోకూడదని గుర్తు చేశారు.
రెండేండ్ల పాలనంతా తిట్ల పురాణమే..
జర్నలిస్టులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనేకసార్లు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే, జర్నలిస్టు క్రాంతి కిరణ్ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జర్నలిస్టులను ప్రోత్సహించిన రేవంత్‌రెడ్డి.. అధికారంలోకి రాగానే జర్నలిస్టులందరినీ నిందిస్తున్నారన్నారు. అక్రిడిటేషన్ కావాలంటే డిగ్రీ తప్పనిసరి అని.. తమ హయాంలో నిబంధనలు పెట్టామని, దాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి రెండేండ్లవుతున్నా.. ఇప్పటి వరకు అక్రిడిటేషన్లు ఇవ్వలేదన్నారు. నేటికీ గత ప్రభుత్వం ఇచ్చిన అక్రిడిటేషన్లే స్కిక్కర్లతో కొనసాగిస్తున్నారని ఎద్దేవా చేశారు.
అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో సీఎం రేవంత్‌రెడ్డి జర్నలిస్టులకు చేసిందేమీ లేదన్నారు. జర్నలిస్టులు తమ సమస్యలపై ప్రశ్నించవద్దనే ఇలాంటి పరోక్ష దాడులకు పాల్పడుతున్నారన్నారు. టీ న్యూస్ సీఈవో శైలేశ్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనూ జర్నలిస్టులు కించపరిచే విధంగా మాట్లాడారని, జర్నలిజం వృత్తిపై వ్యంగ్యంగా వ్యాఖ్యానించారన్నారు. కొత్తగా వచ్చిన డిజిటల్ మీడియాపై ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదన్నారు.
టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారూతిసాగర్ మాట్లాడుతూ.. ఇది ప్రెస్‌క్లబ్ కాదు….పబ్ అని, కల్లు కంపౌండ్ అని వ్యాఖ్యానించారని, ఇది జర్నలిస్టుల వృత్తిని కించపరచడమేనని మండిపడ్డారు. జర్నలిస్టులపై అక్కసు పెంచుకున్న సీఎం ఏకంగా ఆ జర్నలిస్టుల వృత్తిపైనే అభండాలు వేస్తున్నారని విమర్శించారు. ఏది నోటికొస్తే అదే మాట్లాడుతున్నారని, ఇప్పటిదాకా పనిచేసిన ఏ సీఎం కూడా ఇలా వ్యవహరించలేదని గుర్తుచేశారు. జర్నలిస్టుల్లో చైతన్యం రావాలని, ఇలాంటి మాటలు మాట్లాడుతున్న వారిపై ఎలా వ్యవహరించాలో కార్యాచరణ తయారు చేసుకోవాలన్నారు.
ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇంత హీనంగా మాట్లాడితే కింద స్థాయి నాయకులు ఏ విధంగా వ్యవహరిస్తారో ఆలోచించుకోవాలన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలను పక్కనపెట్టి జర్నలిస్టులను కించపరిచే వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. జర్నలిస్టులను విభజించాలన్న కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపుతున్నదని, తద్వారా లాభపడాలన్న ధోరణితో అక్రిడిటేషన్ జారీలో జాప్యం చేస్తున్నట్లు కనిపిస్తున్నదన్నారు. సమావేశంలో సీనియర్ జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాస్, మ్యాడం మధు, టెమ్జు ప్రధాన కార్యదర్శి రమణ కుమార్, చేతన్, రంజిత్‌రెడ్డి, శంకర్, మేకల కృష్ణ యాదవ్, యోగి, విజయారెడ్డి తదితరులు పాల్గొన్నారు.