JNTUH | కేపీహెచ్‌బీ కాలనీ, జూన్ 15 : జేఎన్టీయూహెచ్ వర్సిటీలోని మంజీరా బాయ్స్ హాస్టల్లో విద్యార్థుల తినే ఆహారంలో పురుగు రావడంతో విద్యార్థులు ఆందోళన చేశారు. శనివారం మధ్యాహ్నం విద్యార్థులు ఆహారం తినేందుకు సిద్ధం కాగా ఓ విద్యార్థికి ప్లేట్లో పురుగు కనిపించింది. వెంటనే తొటి విద్యార్థులంతా కలిసి మెస్ ఇన్చార్జికి ఫిర్యాదు చేయగా.. స్పందించక పోవడంతో విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకుని హాస్టల్ వార్డెన్ దుర్గాప్రసాద్ అక్కడికి చేరుకుని విద్యార్థులకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు.
విద్యార్థులు వార్డెన్ వాహనాన్ని అడ్డుకుని నిరసన తెలిపారు. విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ హాస్టల్ వార్డెన్ వెంటనే రాజీనామా చేయాలన్నారు. అనంతరం వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ జి.వి.నర్సింహారెడ్డి హామీ మేరకు ఆందోళన విరమించారు. విద్యార్థి సంఘాల నేతలు రాహుల్ నాయక్, గాదె పవన్, బ్రహ్మం, శివారెడ్డి, సాయికుమార్, అర్జున్, రంజిత్, చందు, ఆదిత్య, అనీశ్, అరవింద్, ప్రేమ్‌కుమార్, సిద్ధార్థ, రోహిత్‌రెడ్డి, సాయివర్ధన్ తదితరులు ఉన్నారు.