Hyderabad | గొంతెండని మహానగరం.. విశ్వనగరానికి శాశ్వత జలధారలు
దేశంలోని ప్రధాన నగరాలు చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ.. మెట్రో నగరాలు కాస్మొపాలిటన్ షేర్వానీ కప్పుకున్నా..
- ఉమ్మడి రాష్ట్రంలో 15 రోజులకోసారి తాగునీటి సరఫరా
- సర్కారు ముందుచూపుతో మారిన ముఖచిత్రం
- అటు కృష్ణా.. ఇటు గోదావరి జీవజలాలతో తాగునీటి భరోసా
- పారిశ్రామిక అవసరాలకూ పుష్కలమైన సరఫరాకు అవకాశం
- ఘనత వహించిన ఇతర నగరాల దాహార్తికి నేటికీ వెతుకులాటే
- ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 21 (నమస్తే తెలంగాణ): దేశంలోని ప్రధాన నగరాలు చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ.. మెట్రో నగరాలు కాస్మొపాలిటన్ షేర్వానీ కప్పుకున్నా… లోపల నిత్యం పానీ పరేషానీ మాత్రం వేధిస్తూనే ఉంది. నిజం నిష్టూరమైనా.. నిన్నటిదాకా హైదరాబాద్ మహానగర దుస్థితి కూడా ఇంతే ! ఒకప్పుడు విజయవాడ నుంచి రైల్వే వ్యాగన్లలో నగరానికి తాగునీటిని తరలించిన రోజు ఉంది. ఎండా కాలం వస్తే చాలు.. జలమండలి కార్యాలయాల ఎదుట ఖాళీ బిందెల ప్రదర్శనలు నిత్యకృత్యమయ్యేవి. కానీ 2014 తెలంగాణ ఏర్పాటు తర్వాత నగర తాగునీటి ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. వచ్చే వందేండ్లు కూడా తాగునీటి కటకట లేకుండా సీఎం కేసీఆర్ ప్రదర్శించిన ముందుచూపు చారిత్రక నగరానికి పానీ పరేషానీని శాశ్వతంగా దూరం చేసింది. ఒకవైపు కృష్ణాజలాల సరఫరాలో సుంకిశాలతో తాగునీటి వ్యవస్థకు తిరుగులేని పునాది వేయడంతో పాటు కాళేశ్వరజలాలతో భవిష్యత్‌లో తాగునీటికే కాదు.. పారిశ్రామిక అవసరాలకూ పుష్కలమైన నీటి వసతిని కల్పించారు. అందుకే దేశంలో ఏ మెట్రో నగరానికీ లేని తాగునీటి వ్యవస్థతో హైదరాబాద్ విశ్వ నగరమే షేర్వానీని కప్పుకున్నది. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్శిస్తున్నది.
జీవ ధారలతో నిత్య సరఫరా…
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగర తాగునీటి ముఖచిత్రమే మారిపోయింది. అప్పటికే ఉన్న వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు సీఎం కేసీఆర్ ప్రదర్శించిన ముందుచూపుతో మండు వేసవిలోనూ మహానగరంలో ఏ ఒక్క కాలనీ కూడా తాగునీటి కొరతను ఎదుర్కోలేదు. తెలంగాణ ఏర్పడేనాటికి హైదరాబాద్‌కు కృష్ణా రెండు దశలల్లో 180, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల ద్వారా 50, సింగూర్, మంజీరాతో 120 ఎంజీడీల తాగునీరు వచ్చేది. వేసవి రాగానే… ఒకవైపు సింగూరు ఎండిపోవడం, మరోవైపు నాగార్జునసాగర్‌లో 510 అడుగుల కంటే నీటిమట్టం తగ్గిపోవడంతో 300 ఎంజీడీల నీటి సరఫరా ఆగమ్యగోచరంగా మారేది. సాగర్‌లో అత్యవసర మోటార్లు ఏర్పాటు చేసి నానా తంటాలు పడి అరకొర నీటిని సరఫరా చేసేవారు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖచిత్రమే మారిపోయింది.
- గోదావరి పథకం పనుల్లో భాగంగా రక్షణ, ఆటవీ, రైల్వే శాఖల అనుమతుల్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తీసుకున్న ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
- 2015 నవంబరులో కృష్ణా మూడవ దశ ద్వారా 90 ఎంజీడీలు, 2015 డిసెంబరులో గోదావరి ఫేజ్-1లో భాగంగా రోజూ 172 ఎంజీడీల్లో తొలి విడతగా 86 ఎంజీడీలు, ఆ తర్వాత మరో 86 ఎంజీడీలను నగరానికి తరలించి తాగునీటి కష్టాలకు చెక్ పెట్టారు.
- 2014 నవంబరు 2వ తేదీన మల్కాజ్గిరి నియోజకవర్గంలో రూ.338.54 కోట్లతో చేపట్టిన తాగునీటి పథకం ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ పథకం ద్వారా నియోజకవర్గంలో 3.80 లక్షల మంది కుటుంబాలకు మేలు జరిగింది. రోజు విడిచి రోజూ నీటి సరఫరా జరుగుతుంది.
- రూ. 1900కోట్లతో శివారు మున్సిపాలిటీల్లో చేపట్టిన తాగునీటి పథకం పనులను ఏడాదిలోనే పూర్తి చేశారు. 56 సర్వీసు రిజర్వాయర్ల పనులు, 2200 కిలోమీటర్ల పైపులైన్ డిస్ట్రిబ్యూషన్ పైపులైన్ విస్తరణ పనులను విజయవంతంగా పూర్తి చేశారు.
- ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న 190 గ్రామాల్లోని ప్రజల కోసం అర్బన్ మిషన్ భగీరథలో రూ.756.41కోట్లతో తాగునీటి పథకాన్ని చేపట్టారు.
- ఐటీ కారిడార్‌కు నీటి లభ్యతను పెంచుతూ మెదక్ జిల్లా ఘన్పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి పటాన్చెరువు వరకు రూ.422.80కోట్లతో 45 కిలోమీటర్ల మేర 1800 ఎంఎం సామర్థ్యం కలిగిన పైపులైన్ పనులను పూర్తి ఐటీ కారిడార్‌లో నీటి లభ్యతను పెంచారు.
- రూపాయికే నల్లా కనెక్షన్ తీసుకువచ్చి లక్ష మంది బీపీఎల్ కుటుంబాలకు నల్లా కనెక్షన్ ఇచ్చారు.
- సంస్థకు గుదిబండగా మారిన కరెంట్ బిల్లుల నుంచి ఉపశమనం కల్పించారు. మెట్రో తరహాలో విద్యుత్ రాయితీ పొంది సంస్థకు రూ. 700కోట్ల మేర లబ్ధి చేకూర్చారు.
- అక్రమ నల్లా కనెక్షన్ల క్రమబద్ధీకరణ, వన్ టై సెటిల్మెంట్ ద్వారా వినియోగదారులకు మేలు చేశారు.
- జూబ్లీహిల్స్‌లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్కును ఏర్పాటు చేసి ఇతర నగరాలకు ఆదర్శంగా నిలిచారు.
- గృహ వినియోగదారులకు 20కేఎల్ ఉచిత తాగునీటి పథకంతో 90 శాతం మంది వినియోగదారులకు మేలు జరుగుతుంది.
- కొండపోచమ్మ సాగర్ నుంచి చేపడుతున్న సంగారెడ్డి కాల్వ నుంచి గోదావరి జలాలను తరలించి డెడికేటెడ్ రిజర్వాయర్ ద్వారా మరింత భరోసా కల్పించేందుకు రూ.4777 కోట్లతో కేశవాపూర్ రిజర్వాయర్ పనులకు కూడా సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు.
- నగరానికి కృష్ణాజలాలు అందేలా సుమారు రూ.1600 కోట్లతో శాశ్వత ప్రాతిపదికన సుంకిశాల పథకం పనులను కూడా శరవేగంగా కొనసాగిస్తున్నారు.
- పూర్వం హుస్సేన్‌సాగర్ నుంచి రా (ముడి నీరు) వాటర్‌ను తీసుకొని నారాయణగూడలో ఉన్న ఫిల్టర్ బెడ్లలో శుద్ధి చేసి హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించేవారు.
- ఆ తర్వాత మూసీ, ఈసీ నదులపై నిజాం నవాబ్ నిర్మించిన జంట జలాశయాలు నేటికీ రోజుకు కనీసంగా 20 మిలియన్ గ్యాలన్ల నీటిని అందిస్తూనే ఉన్నాయి.
- ఆపై మంజీరాపై ఉన్న సింగూరును సాగునీటికి దూరం చేసి హైదరాబాద్‌కు తాగునీటి సరఫరా వ్యవస్థగా మార్చారు.
- అనంతరం కృష్ణాజలాల్ని ఆశ్రయించిన మహానగరం మూడు దశల్లో రోజుకు 270 మిలియన్ గ్యాలన్ల చొప్పున శుద్ధి చేసిన నీటిని అందుకుంటుంది. అంటే తాగునీటి కోసం 115 కిలోమీటర్ల దూరం పోవాల్సి వచ్చింది.
- చివరకు హైదరాబాద్ గోదావరి నదీని ఆశ్రయించక తప్పలేదు. ఎల్లంపల్లి జలాశయం నుంచి దాదాపు 200 కిలోమీటర్లకు పైగా పైప్‌లైన్ వేసి రోజుకు 172 మిలియన్ గ్యాలన్ల గోదావరి జలాల్ని సరఫరా చేసి నగరవాసుల నీటి అవసరాల్ని తీర్చకోవాల్సి వస్తుంది.
- ఇలా హైదరాబాద్ నగర చరిత్రను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే నదుల వెంట పరుగులు తీసిన దృశ్యాలు కనిపిస్తాయి.
నాడు దినదిన గండమే…
ఇన్ని వనరుల నుంచి హైదరాబాద్‌కు తాగునీటి సరఫరా జరుగుతున్నా… సాంకేతికంగా చూస్తే ఇది దినదినగండమే. ఉమ్మడి రాష్ట్రంలో ఏ రోజుకు ఆ రోజు కొత్త వనరుల నుంచి నీటిని సరఫరా చేశారే తప్ప ఈ మహా నగరానికి ఒక డెడికేటెడ్ రిజర్వాయర్ (నీటి వనరు)ను పక్కనే ఏర్పాటు చేయాలనే సోయి పాలకుల్లో కనిపించలేదు. దాని ఫలితంగానే 24/7 పైపులైన్లలో నీటి సరఫరా జరిగితే తప్ప హైదరాబాద్ మనుగడ లేదు. సరఫరాలోగానీ, పైప్లైన్లోగానీ చిన్న లోపం ఏర్పడినా అది సర్దుబాటు అయ్యే వరకు నీటి కొరతను ఎదుర్కోక తప్పదు. తాగునీటికే అత్తెసరు సరఫరాతో కాలం వెళ్లదీస్తున్న హైదరాబాద్‌లో పారిశ్రామిక అవసరాలకు పుష్కలంగా నీళ్లిచ్చే పరిస్థితి లేదు. మహా నగరంలో ఎక్కడైనా వెయ్యి ఫీట్ల మేర బోర్లు వేస్తే తప్ప పాతాళ గంగ పైకి రాని దుస్థితి.
హైదరాబాద్ తాగునీటి వ్యవస్థ ముఖచిత్రం ఇలా…
జలమండలి పరిధి – 1450 చదరపు కిలోమీటర్లు
హైదరాబాద్ జనాభా – 1.20 కోట్లు
సరఫరా అవుతున్న నీటి పరిమాణం – రోజుకు 500 మిలియన్ గ్యాలన్లు(ఉస్మాన్‌సాగర్-13,
హిమాయత్‌సాగర్-12,
మంజీరా, సింగూరు-103,
కృష్ణా-276, గోదావరి-170 ఎంజీడీలు)
పరిశ్రమలకు మహర్దశ…
కాళేశ్వరం ప్రాజెక్టుతో హైదరాబాద్ మహా నగరానికి గోదావరి జలాల నుంచి శాశ్వత భరోసా దొరకడమే కాదు… పరిశ్రమలకు కూడా మహర్దశ వచ్చినట్లయింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికలోనే పారిశ్రామిక అవసరాలకు 16 టీఎంసీలను కేటాయించడం గొప్ప విషయం. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సమీపంలో గోదావరి నిల్వలతో జలాశయాలు ఉండటంతో పరిశ్రమలకు నేరుగా ముడి నీటిని (రా వాటర్)ను కూడా కేటాయించేందుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి.
పొదుపుగా వాడుతున్నాం
ఒకప్పుడు నీటి కోసం పడరాని పాట్లు పడ్డాం. వీధుల్లో వాటర్ ట్యాంకర్‌తో ఇచ్చేవాళ్లు. లైన్లో నిలబడి.. రాత్రింబవళ్లు నీటి కోసం నానా అవస్థలు ఎదుర్కొన్నాం. ఇప్పుడు నేరుగా ఇంట్లోకే నీళ్లు రావడంతో చాలా సంతోషంగా ఉంది.
– కట్ట నీరజ, కుత్బుల్లాపూర్
సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమైంది
సీఎం కేసీఆర్ వచ్చాకే తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ఒకప్పుడు చుట్టాలు వస్తే తాగేందుకు నీటిని కొనుగోలు చేసేది. ఇప్పుడు అలాంటి సమస్య లేదు. ఇలాంటి రోజులు వస్తాయని కలలో కూడా ఊహించలేదు.
– సరిపల్లి పద్మజారెడ్డి, సుభాష్‌నగర్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

