నింగినంటే భవనాలు.. రంగురంగుల ఐటీ టవర్లు.. మహానగర గ్రేటర్ రూపరేఖలను మార్చేయడం వెనక రాత్రింబవళ్లు లక్షలాది మంది శ్రామికుల అహర్నిశల శ్రమ దాగి ఉంది. దశాబ్దాలుగా కరువు సీమ పాలమూరు జిల్లా నుంచి పొట్టకూటి కోసం అత్యధిక మంది వలస వచ్చిన కూలీలే.. ఈ నగర నిర్మాణానికి వెన్నెముక. మహానగరంలో పెద్ద పెద్ద కమర్షియల్ కాంక్రీట్ రెడీ మిక్స్ లారీలు తిరగలేని ఇరుకైన ప్రాంతాల్లోనూ పేద, మధ్యతరగతి ప్రజల ఇండ్ల నిర్మాణాలకు కాంక్రీట్ మిక్సర్ ఏకైక ఆధారం. ఈ మిక్సర్లపై అత్యధిక శాతం నిరుపేదలే ఆధారపడి జీవిస్తున్నారు.
ఇప్పుడు రవాణా, పోలీస్ శాఖ అధికారుల తీరుతో వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. వారి ఉపాధికి ఆధారమైన చిన్న మిక్సర్ యంత్రాలపై భారీ జరిమానాలు వేస్తూ.. ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పది మంది ఒక గుంపుగా ఏర్పడి రెకల కష్టాన్ని నమ్ముకొని.. కాంక్రీట్ అప్లోడ్ మిక్సర్ యంత్రాల సహాయంతో ఇంటి స్లాబులు వేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆర్టీవో అధికారులు, ట్రాఫిక్ పోలీసుల రూపంలో వస్తున్న భారీ జరిమానాల దెబ్బ వల్ల కూలీల నోటికాడి కూడును లాగేసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.
– సిటీబ్యూరో, జూలై 1 (నమస్తే తెలంగాణ)

మహానగరంలో పెద్ద పెద్ద కమర్షియల్ కాంక్రీట్ రెడీ మిక్స్ లారీలు తిరగలేని ఇరుకైన గల్లీల్లో, పేద, మధ్యతరగతి ప్రజల ఇళ్ల నిర్మాణాలకు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల స్లాబ్ లకు కాంక్రీట్ మిక్సర్ అతి ముఖ్యమైంది. ఈ మిక్సర్ లపై అత్యధిక శాతం నిరుపేదలే ఆధారపడి జీవిస్తున్నారు. అలాంటి వాటిని పూర్తిగా నిలిపివేసేలా జరిమానాలు విధించడం వల్ల కేవలం వలస కూలీల పొట్ట కొడుతున్నారు. ఫలితంగా నగరంలో సొంతింటి కల కంటున్న సామాన్యుల నిర్మాణ వ్యయం కూడా పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
ఫలితంగా అడ్డా కూలీల బతుకులు కూడా అగమ్యగోచరంగా తయారయ్యే ప్రమాదం ఏర్పడింది. స్పెషల్ మొబైల్ స్వాడ్ పేరుతో ఆర్టీవో అధికారులు తమ టార్గెట్ పూర్తి చేసుకునేందుకు మిక్సర్లపై ఉకుపాదం మోపి ఉపాధిని దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవన నిర్మాణ సామగ్రి, మిక్లర్ రవాణాకు సంబంధించి కార్మికుల వద్ద అన్ని రకాల ప్రభుత్వ పత్రాలు, పన్ను రశీదులు సక్రమంగా ఉన్నప్పటికీ గత రెండు రోజుల కిందట కాటేదాన్ వద్ద ట్రాక్టర్లను అడ్డుకొని కేసు రాయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా రూ. 18 వేల పెనాల్టీ విధించారు.
ఇదిలా ఉంటే ఆటో నగర్ లో అయితే ట్రాక్టర్ కు అన్ని పత్రాలు ఉన్నాయని చెప్పినా అర్ధరాత్రి 11 గంటలకు ఆర్టీవో అధికారులు మిక్సర్ సామగ్రిని అడ్డుకొని ట్రాక్టర్ పై కేసు నమోదు చేసినట్టు బాధితులు తెలిపారు. ఇలా తమ టార్గెట్ను పూర్తి చేసుకునేందుకు ప్రతి రోజూ 20 నుంచి 25 ట్రాక్టర్లపై కేసులు నమోదు చేసి వేలల్లో పెనాల్టీలు విధించడం పరిపాటిగా మారింది. ఆర్టీవో అధికారులు, ట్రాఫిక్ పోలీసులు కాంక్రీట్ మిక్సర్ సామగ్రి కనిపించగానే వెంటనే అడ్డుకుంటున్నారని చెబుతున్నారు.

వినియోగం ఇలా..!
కాంక్రీట్ మిక్సర్ సామగ్రిని ప్రతి రోజు ఉదయం 5 గంటల నుంచి ఉదయం 7.30 గంటల లోపు అన్ని పత్రాలు ఉన్నా.. కమర్షియల్ ట్రాక్టర్ సహకారంతో నిర్మాణ భవనం వద్దకు తీసుకువెళ్తుంటారు. సాయంత్రం వరకు అకడే కార్మికులు ఇంటి స్లాబ్ లు వేసి తిరిగి ఇంటికి వస్తుంటారు. మళ్లీ మరుసటి రోజే ఉదయం మరో స్లాబ్ వద్దకు వాటిని ట్రాక్టర్ ద్వారా తరలిస్తుంటారు. మిక్సర్ సామగ్రి ట్రాక్టర్ వెనక తగిలించుకోవడం మోటార్ వాహనాల చట్టానికి విరుద్ధమంటూ అర్ధరాత్రి 11 గంటలకు, తెల్లవారు జామున 4 గంటల సమయంలో సైతం అధికారులు రోడ్లపై అడ్డుకొని కేసులు నమోదు చేస్తున్నారు.
ఆర్టీవో అధికారులకు భయపడి ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా అర్ధరాత్రి మిక్సర్ సామగ్రిని తీసుకువస్తున్నప్పటికీ అధికారులు ఆ సమయంలో సైతం కేసులు రాస్తున్నారని వాపోతున్నారు. మిక్సర్ సామగ్రిపై కేసులు వేసి ఆర్టీసీ డిపోలు, పోలీస్ స్టేషన్లకు తరలిస్తుండటంతో ఒకో మిక్సర్ సామాగ్రిపై ఆధారపడి జీవిస్తున్న 20 కుటుంబాలకు జీవనోపాధి లేకుండా పోతుండడంతో వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ ఆప్లోడ్ కాంక్రీట్ మిక్సర్ సామగ్రి వ్యవస్థపై ఒక పెద్ద ఉపాధి ఆర్థిక చక్రం ఆధారపడి ఉంది.
గ్రేటర్ పరిధిలో లక్ష మంది వలస కార్మికులు ఈ స్లాబ్ మిక్సర్ రంగంపైనే ఆధారపడి బతుకుతున్నారు. ఒక మిక్సర్ నడవాలంటే ట్రాక్టర్ డ్రైవర్, మిక్సర్ ఆపరేటర్, సిమెంట్, ఇసుక మోసే కూలీలు ఇలా 15 మంది శ్రామికులతో పాటు ఓ స్లాబ్ లాగెందుకు ఓ మేస్త్రీ, ఎలక్ట్రీషియన్, నలుగురు సెంట్రింగ్ లేబర్ ఇలా దాదాపు 20 నుంచి 25 మంది అవసరమవుతుంటారు. ప్రభుత్వం ఇటువంటి కుటీర ఉపాధి రంగాలను ప్రోత్సహించాల్సింది పోయి వాటి మనుగడనే ప్రశ్నార్థకం చేసేలా కఠిన నిర్ణయాలు అమలు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పత్రాలు ఉన్నప్పటికీ కేసులు రాశారు
వాణిజ్య అవసరాల కోసం తీసుకున్న ట్రాక్టర్ ద్వారా మిల్లర్ సామాగ్రిని తరలిస్తుండగా ఉదయం 6 గంటల సమయంలో కాటేదాన్ వద్ద అడ్డుకుని కాగితాలు పరిశీలించారు. అన్నీ ఉన్నప్పటికీ మిల్లర్ సామగ్రి ఉందని కేసు రాశారు. రూ. 18 వేలు చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇదేంటని ప్రశ్నిస్తే మా టార్గెట్ పూర్తి చేయాలని సమాధానం చెప్పారు. ప్రభుత్వం స్పందించి అన్ని పత్రాలు ఉన్న మా ట్రాక్టర్లపై కేసులు అవ్వకుండా చూడాలి.
– శాంతయ్య (మిల్లర్ కార్మికుడు, గుడిమలాపూర్)
మా కడుపు కొట్టకండి
కొన్ని సంవత్సరాలుగా మిల్లర్ సామగ్రిపై ఆధారపడి జీవిస్తున్నాం. ఇప్పుడు ఆర్టీవో అధికారుల కారణంగా కేవలం ఒక జూన్ నెలలోనే ఐదు రోజుల పాటు పనులు లేకుండా పోయాయి. మిల్లర్ సామగ్రిపై కేసులు నమోదు చేసి మా కడుపు కొట్టకండి. మాపై దయచూపండి.
– ఈ. తిరిపతయ్య (కాంక్రీట్ మిల్లర్ కార్మికుడు, రామంతాపూర్)
మా ఉపాధిని దెబ్బకొట్టొద్దు
మిక్సర్ అనేది వాహనం కాదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ కొంత మంది ఆర్టీవో అధికారులు నిలువు దోపిడీ చేస్తున్నారు. మరో వైపు ట్రాఫిక్ పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురిచేసున్నారు. ప్రతి రోజు ఉదయం 7 గంటలలోపు నిర్మాణం జరిగే ప్రాంతానికి వెళ్లిపోయే మిక్సర్ సామగ్రిని అడ్డుకుంటూ కార్మికులకు ఉపాధి లేకుండా చేస్తున్నారు. దీనిపై అనేక మార్లు మంత్రులు, అధికారులను కలిశాం. అధికారుల వేధింపులు ఇలాగే కొనసాగితే భవన నిర్మాణ రంగంలో ఉన్న అన్ని సంఘాలతో కలిసి అధికారుల మొండి వైఖరిని ఎండగట్టేందుకు నిరసన కార్యక్రమాలు చేపడుతాం.
– కాంక్రీట్ మిల్లర్ల లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్, రాష్ట్ర అధ్యక్షుచు వాకిటి నాగరాజు