GHMC | సిటీబ్యూరో, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : పారిశుధ్య నిర్వహణ అక్రమాల నిగ్గు తేల్చేందుకు బల్దియా విజిలెన్స్ బృందం రంగంలోకి దిగింది. ఇటీవల సర్కిల్ -15 (ముషీరాబాద్)కు చెందిన ఇద్దరు పారిశుధ్య కార్మికులు తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై స్వీపింగ్ యంత్రాలకు బదులుగా పనిచేశారు. అయితే స్వీపింగ్ యంత్రాలతో శుభ్రం చేయించాల్సిన చోట కార్మికులతో పనులు చేస్తున్నారని, యంత్రాలు నడవకపోయినా.. ఏజెన్సీలు బిల్లులు క్లెయిమ్ చేస్తున్నాయంటూ.. తదితర అంశాలతో ‘నమస్తేతెలంగాణ’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
దీనిపై కమిషనర్ రోనాల్డ్ రాస్ స్పందించారు. సంబంధిత శానిటేషన్ విభాగం అడిషనల్ కమిషనర్ ఉపేందర్‌రెడ్డిని ఆరా తీశారు. కమిషనర్‌కు ఉపేందర్‌రెడ్డి సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. కమిషనర్‌ను తప్పుదోవ పట్టించే రీతిలో వ్యవహరించారన్న చర్చ ఉద్యోగుల్లో జరిగింది. సదరు అదనపు కమిషనర్‌పై కమిషనర్ రోనాల్డ్‌రాస్ ఒకింత అసహనాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే అవినీతి అరోపణలు ఉన్న ఉపేందర్‌రెడ్డిని శానిటేషన్ విభాగంలో ఎందుకు నియమించారని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సైతం కమిషనర్‌తో చర్చించారు.
ఈ నేపథ్యంలో శానిటేషన్ విభాగంలో స్వీపింగ్ యంత్రాల నిర్వహణలో జరుగుతున్న తంతును నిగ్గు తేల్చేందుకు విజిలెన్స్ బృందం దృష్టి సారించింది. త్వరలోనే కమిషనర్ రోనాల్డ్ రాస్కు నివేదిక ఇవ్వనున్నట్లు ఉద్యోగుల్లో చర్చ జరుగుతున్నది. కాగా, జీహెచ్ఎంసీలో దాదాపు 35 స్వీపింగ్ యంత్రాలు ఉండగా.. వీటిలో బల్దియాకు చెందిన 17 వాహనాల కాలపరిమితి ముగియడంతో పక్కన పడేశారు. ప్రస్తుతం సుమారు 18 వెహికల్స్ అద్దె ప్రాదిపదికన కొనసాగుతున్నాయి.
ఇందుకు గాను ఏజెన్సీలకు ఒక్కో వాహనానికి ఏడాదికి రూ. కోటి 13 లక్షలకు పైగా చెల్లిస్తున్నారు. ప్రతి ఏటా వీటి కోసం రూ. 20కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. ఈ స్వీపింగ్ యంత్రాలతో ఒక్కో మిషిన్ 40 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల వరకు క్లీన్ చేయాలి. కానీ కొన్ని ఏజెన్సీలు సగం కిలోమీటర్లు కూడా శుభ్రం చేయకుండా బిల్లులు క్లెయిమ్ చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. వీటితో పాటు నగరంలోని వీఐపీలు ఉండే ప్రాంతాల్లోనే తప్ప కమర్షియల్ కారిడార్లు, ప్రధాన రహదారులపై మాత్రం యంత్రాలు కనిపించడం లేదని కార్మిక సంఘాల నేతలు వాపోతున్నారు.