సిటీబ్యూరో, జనవరి 7 (నమస్తే తెలంగాణ) : కొత్త ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో మార్గాలపై కసరత్తు మొదలైంది. ఇంజినీరింగ్ నిపుణులతో ఆదివారం బేగంపేటలోని మెట్రో రైలు భవన్లో హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి కీలకమైన అంశాలపై ప్రత్యేకంగా చర్చించారు. మొదటి దశ కన్నా మరింత మెరుగైన, తక్కువ వ్యయంతో రెండో దశ మెట్రో మార్గాలను నిర్మించడంపై ఇంజినీర్లు, కన్సల్టింగ్ నిపుణులతో సుధీర్ఘంగా మేధోమథనం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రో రెండవ దశలో చేపట్టే మార్గాలను సమూలంగా సవరించింది. మొత్తం ఐదు మార్గాల్లో 76 కి.మీ మేర మెట్రో కారిడార్లను నిర్మిస్తూ, ఎయిర్‌పోర్టును, కొత్తగా నిర్మించే హైకోర్టు సముదాయాన్ని అనుసంధానం చేస్తూ కొత్త మార్గాలను సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. దానికి అనుగుణంగానే నాగోల్ – ఎల్బీనగర్ – మైలార్‌దేవ్‌పల్లి-శంషాబాద్ ఎయిర్‌పోర్టు, లేదా నాగోల్-ఎల్బీనగర్- మైలార్‌దేవ్‌పల్లి- కొత్తగా నిర్మించే హైకోర్టు భవనం (రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం) వరకు నిర్మించే రెండు మార్గాల్లో ఏ దానికి ప్రాధాన్యతనివ్వాలన్న అంశంపై ప్రధానంగా ఇంజినీర్లలో చర్చించారు.
ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా మీదుగా వచ్చే మెట్రో మార్గాన్ని చాంద్రాయణగుట్ట వరకు పొడిగించి, పాతబస్తీకి ఎయిర్‌పోర్టుకు మెట్రో కనెక్టివిటీ కల్పించి ఇంటర్చేంజ్ స్టేషన్‌గా చాంద్రాయణగుట్టను పరిగణలోకి తీసుకొని అధ్యయనం చేయాలని మెట్రో ఎండీ సూచించారు. రెండు వైపుల నుంచి మెట్రో మార్గాలు చాంద్రాయణగుట్ట చౌరస్తాలో కలపాలంటే ఇప్పటికే అక్కడ ఉన్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రధాన అడ్డంకిగా మారనున్నది. అంతేకాకుండా రోడ్ల విస్తరణ చేపట్టాల్సి ఉంటుంది. మెట్రో రైళ్లు రివర్స్ తీసుకునేందుకు, ఒక ట్రాక్ నుంచి మరో ట్రాక్‌పైకి వెళ్లేందుకు వీలుగా అనువైన స్థలం ఉండాలి. ఇవన్నీ జరగాలంటే చాంద్రాయణ గుట్ట చౌరస్తా కాకుండా మైలార్‌దేవ్‌పల్లి వెళ్లే వైపు ఇంటర్చేంజ్ స్టేషన్ ఏర్పాటుకు సానుకూలతలను గుర్తించాలని ఇంజినీర్లకు ప్రత్యేకంగా సూచించారు.
మెట్రో రెండో దశలో నడిపే రైళ్ల కోసం కొత్తగా మెట్రో డిపోలు, నిర్వహణ కోసం ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ (ఓసీసీ) అవసరముంటుందని, వీటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ మెట్రో డిపోలు ఏర్పాటు చేయాలనే దానిపై అధ్యయనం చేయాలని సూచించారు. ముఖ్యంగా మైలార్‌దేవ్‌పల్లి నుంచి ఎయిర్‌పోర్టు రోడ్డులో కొంత దూరం మెట్రో మార్గాన్ని భూమి మీద నిర్మించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను గుర్తించాలన్నారు. రెండో దశలో నిర్మించే మెట్రో మార్గంలో ఖర్చును తగ్గించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారని, దానికనుగుణంగానే ఇంజినీర్లు అధ్యయనం చేయాలన్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, మెట్రో రైడర్ షిప్‌ను పెంచడం కోసం ఉత్తమ పద్ధతులను తెలుసుకోవడంతో పాటు ఇప్పటికే నిర్వహణలో ఉన్న మెట్రో మొదటి దశ అనుభవాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు.
కొత్త మెట్రో స్టేషన్లలో తగినంత పార్కింగ్ సదుపాయం ఉండాలని, మెట్రో స్టేషన్ల నుంచి చివరి మైలు కనెక్టివిటీ, పాదచారులకు మంచి సౌకర్యాలు ఉండేలా చూడాలన్నారు. ప్రధానంగా ఎయిర్‌పోర్టుకు వెళ్లే మెట్రో ప్రయాణికుల లగేజీ కోసం మెట్రో రైళ్లలో తగినంత స్థలం ఉండేలా డీపీఆర్‌లను సిద్ధం చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ డీ.వీ.ఎస్.రాజు, చీఫ్ సిగ్నల్ అండ్ టెలికాం ఇంజినీర్ ఎస్కే.దాస్, చీఫ్ ప్రాజెక్టు మేనేజర్ బి.ఆనంద్‌మోహన్, జనరల్ మేనేజర్లు ఎం.విష్ణువర్దన్ రెడ్డి, బీఎన్.రాజేశ్వర్, కన్సల్టెన్సీ సంస్థకు చెందిన మెట్రో రైలు ప్రాజెక్టు నిపుణులు పాల్గొన్నారు.
ప్రస్తుతం నగర వాసులకు అందుబాటులో ఉన్న మొదటి దశ మెట్రో రైలు కోసం వాడుతున్న సిగ్నలింగ్ టెక్నాలజీ, రెండో దశకు వాడుకునేందుకు అనుకూలంగా ఉంటుందా లేదా అన్న అంశానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి, దానిపై ప్రత్యేకంగా అధ్యయనం చేయాలని కన్సల్టింగ్ ఇంజినీర్లకు సూచించారు. రెండు దశలకు సంబంధించి ఒకే విధమైన సిగ్నలింగ్, రైలు నియంత్రణ వ్యవస్థ, కోచ్‌లను వినియోగించడం వల్ల కలిగే లాభాలు, నష్టాలపైనా సుదీర్ఘంగా చర్చించారు.
ఇప్పటికే ఉన్న సాంకేతికత, మెట్రో కోచ్ సరఫరా దారుల పరిమిత వాణిజ్య పద్ధతులను కాదని, కొత్తగా పోటీదారుల నుంచి టెక్నాలజీని వినియోగించుకోవడంతో ఏ మేరకు ప్రయోజనం ఉంటుందన్న విషయాన్ని పరిగణలోకి తీసుకొని అధ్యయనం చేయాలన్నారు. ముఖ్యంగా మెట్రోలో ప్రయాణించే వారికి అతుకులు లేని ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేందుకు అధిక ప్రాధాన్యతనివ్వాలని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఇంజినీర్లకు దిశానిర్ధేశం చేశారు.