కుత్బుల్లాపూర్,నవంబర్ 22 : నిరుపేద కుటుంబం..పోలీస్ కావాలనే సంకల్పం..ప్రయత్నం చేసినా ఫలితం దక్కకపోవడంతో తల్లిదండ్రులను నమ్మించేందుకు ఓ యువతి ఏకంగా ఖాకీ దుస్తులను కొనుగోలు చేసి కానిస్టేబుల్ అవతారమెత్తింది. తనకు పోలీస్ ఉద్యోగం వచ్చిందంటూ ఇంట్లోని తల్లిదండ్రులను నమ్మించింది. తాను సృష్టించుకున్న నకిలీ ఐడీకార్డు, ఖాకీదస్తులతోపాటు అచ్చం పోలీస్‌ను పోలి ఉండేలా దర్శనమిచ్చేసరికి పాపం ఆ తల్లిదండ్రులు కూడా నమ్మకతప్పలేదు. కానీ అంతలోనే ఆ యువతి బండారం బయటపడింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… షాపూర్‌లోని బాలానగర్ జోన్ డీసీపీ కార్యాలయం ఎదురుగా నివాసం ఉంటున్న నందికంటి ఉమాభారతి(23) డిగ్రీ చదువుతుంది. తల్లిదండ్రులు మేదరిపనులు చేస్తుండగా ఇంట్లో చాలీచాలని వసతులతో కాలం వెళ్లదీస్తున్నారు. ఏదైనా ఉద్యోగం చేయాలని తల్లిదండ్రులు బలవంతం చేస్తుండడంతో ఇటీవల కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. కానీ పోలీస్‌పై ఆమెకు ఉన్న మక్కువతో ఎలాగైనా తన తల్లిదండ్రులను నమ్మించాలని చూసింది. ఇన్‌స్టాగ్రాంలో వెలువడిన ఐడీకార్డుతో నకిలీకార్డును సృష్టించుకుంది.
రెండు సెట్ల ఖాకీదుస్తులు, కట్షూష్, బ్లాక్‌బెల్ట్, నేమ్‌ప్లేట్, ప్లాగ్బ్యాచ్, విజిల్కార్డ్, రెండు క్యాప్‌లు కొనుగోలు చేసింది. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలు, గోల్కొండ బోనాలు, కోటి దీపోత్సవం, సెక్రటేరియట్లో సీఎం బందోబస్త్‌తో పాటు పలువురు వీఐపీల బందోబస్తు నిర్వహించింది. ప్రతి రోజు ఇంట్లో ఉద్యోగానికి వెళ్తున్నానని చెప్పి అలా టైంపాస్ చేసి వచ్చేది. కానీ ఇది ఎక్కువ రోజులు నిలవకుండానే ఈ నెల 21న సైబరాబాద్ సీపీ కార్యాలయం క్యాంటిన్ వద్ద టిఫిన్ చేస్తుండగా ఉన్నతాధికారులకు అనుమా నం రావడంతో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు ఆరాతీయగా ఉన్న విషయమంతా బయటపడింది. సదరు యువతిని జీడిమెట్ల పోలీసులకు అప్పగించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు
చేస్తున్నారు.