అమీర్‌పేట్, అక్టోబర్ 29 : ‘ఎందుకొచ్చిన ప్రచారంరా నాయనా.. అటు దిక్కు పోకున్నా.. బాగుంటుండె. అనవసరంగా ఒచ్చి, బుర్దల కాలు పెట్టినైట్టెంది..’ అని ఖచ్చితంగా అనుకుని ఉంటారు మంత్రులు పొన్నం, వివేక్.. నిన్నటి దాకా ఎరువుల నిరసనతో అవస్థలు పడ్డ రైతుల విషయాన్ని మరిచి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా… కనిపించింది కదా అని.. ఓ కూరగాయల మార్కెట్లో ప్రచారానికి ఉరికిన ఇద్దరు మంత్రులకు గట్టిగా తెలిసొచ్చింది. ఏ వర్గానికైతే.. మనవల్ల మేలు జరగలేదో.. ఆ వర్గం వైపు కన్నెత్తి కూడా చూడొద్దని. అట్లంటే.. కాంగ్రెస్ సర్కార్తోని మంచి జరిగిందే లేదెక్కడ.
అట్లంటే వాళ్లు ప్రచారానికి దూరంగానే ఉండాలె.. ఈ లెక్కన..! అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది.. ఎక్కడైతే మంత్రులు, తమ లేని గొప్పతనాన్ని చూపేందుకు వెళ్లారో, అక్కడ.. తమపై ఒంటికాలు మీద, లేచినంత పని చేసిన వారంతా పొరుగు జిల్లాలకు చెందిన రైతులని, వారెవరూ ఉప ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గం ఓటర్లు కారని పాపం ఆ మంత్రులకు తెలియదు. తెలిసి తెలిసి.. ఓటర్లే కాని వారి దగ్గరికి మంత్రులను తీసుకొచ్చి, మహిళా రైతులతో దుమ్ము దులిపించిన ఆ మార్గదర్శి ఎవరో…?
ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి..
రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గ పరిధిలోని రైతుబజార్లో ఎన్నికల ప్రచారానికి ఇద్దరు మంత్రులు పొన్నం, వివేక్‌లు వెళ్లారు. అంతా బాగుంటుదనుకుని రైతుబజార్‌లోకి అడుగు పెట్టిన వారికి, అక్కడి రైతులు గట్టిగానే షాకులిచ్చారు. అసలే ఎరువుల విషయంలో పీకల దాకా కోపంతో ఉన్న వారితో, మంత్రులు ప్రచారంలో భాగంగా మాటలు కలిపారు. ముందుగా మంత్రి వివేక్ ఓ మహిళా రైతును కదిలించారు. సమస్యలేమైనా ఉన్నాయామ్మా అని వాకబు చేస్తే.. క్షణం కూడా ఆలోచించకుండా, ఎరువుల ఇస్తమని చెప్పి.. ఇన్ని ఇబ్బందులు పెడ్తరా, అంటూ అందుకుంది.. దీంతో అప్రమత్తమైన మరో మంత్రి పొన్నం, చల్లగా అక్కడి నుండి పక్కకు జారుకునే ప్రయత్నం చేశారు.
అయితే ఎరువులు ఇయ్యాల్సింది కేంద్రం కదమ్మా.. అంటూ నెపం కేంద్రం మీదకు నెట్టేసి వివేక్ అక్కడి నుండి ముందుకు కదిలారు. మంత్రి వివేక్ మరో మహిళా రైతును కదిలిస్తే లొల్లి చేసినంత పనైంది.. ఇక నా వంతు ఎట్లుంటదో అని అనుకుంటూనే.. మిర్చి అమ్ముతున్న మహిళా దగ్గరకు వెళ్లి.. ఏం అడగాలో తెలియక.. మంచి గిరాకీ జరుగుతున్న టైంలో.. ఇది కారం మిర్చేనామ్మా అని అడిగినా.. ఆమె ముఖం చిట్లించుకుందే తప్ప.. సమాధానం లేదు..! మంచి గిరాకీ టైంల, వీళ్ల లొల్లి ఏందో.. అన్నట్టు ముఖం పెట్టేసరికి పాపం మంత్రుల ముఖాలు చిన్నబోయాయి. మన ఖర్మకొచ్చింది కదరా బై.. ఈ బై ఎలక్షనంటూ.. తిరుగుముఖం పట్టారు మంత్రులు, వారి మందీమార్బలం..