Woman Suicide | బండ్లగూడ, మార్చి 14 : వరకట్నం వేధింపులు తాళలేక ఓ మహిళ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. అత్తాపూర్ పాండురంగ నగర్లో నివాసముండే వీరిశెట్టికి ఒక కుమారుడు నాగేష్ శెట్టి, కుమార్తెలు సారిక, స్వప్న ఉన్నారు. పెద్ద కుమార్తె సారిక పెళ్లి అయిపోగా చిన్న కుమార్తె స్వప్నను కర్ణాటకకు చెందిన ఆమ్రేష్కు ఇచ్చి 2022లో వివాహం జరిపించారు. వీరికి ఒక కుమార్తె ఉంది.
కాగా ఇంతా కాలం బాగానే ఉన్నా ఆమ్రేష్ స్వప్నను అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. పలుమార్లు ఆమ్రేష్కు స్వప్న తల్లిదండ్రులు, బంధువులు నచ్చజెప్పిన వినకుండా ఆమెను వేధిస్తున్నాడు. ఈ వేధింపులు తాళలేక స్వప్న ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన ఆమ్రేష్ వెంటనే వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వెంటనే వీరిశెట్టి, నాగేష్ శెట్టిలు అక్కడికి చేరుకోని పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. స్వప్న అన్న నాగేష్ శెట్టి ఇచ్చిన ఫిర్యాదు వరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.