నాంపల్లి కోర్టులు, మే 20 (నమస్తే తెలంగాణ): నకిలీ పాస్‌పోర్టు కేసులో 25వ నిందితురాలిగా తమిళనాడులోని తిరువళ్లూర్‌కు చెందిన మహిళ వరునియా తిరువణ్ణవుక్కరాసును సీఐడీ అధికారులు అరెస్టు చేసి, 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరుపర్చగా, 14 రోజుల రిమాండ్ విధించి చంచల్‌గూడ మహిళా కారాగారానికి తరలించారు. ఆమె తరఫున దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌కు సోమవారం సీఐడీ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. పాస్‌పోర్టు ఏజెంట్ మురళీధరన్ అలియాస్ మురళీతో ఏర్పడిన పరిచయంతో చెన్నైకి చెందిన ఏజెంట్ పర్థిబన్ ద్వారా ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్, ఓటరు గుర్తింపు కార్డుతోపాటు విద్యకు సంబంధించిన పత్రాలను సైతం ఆమె పొందారు. ఈ పత్రాలన్నింటినీ జతచేసి ప్రధాన నిందితుడు సత్తార్‌తో పాటు అతడి అనుచరుల సహాయంతో ఆమె భారత్ పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నది.
భారత జాతీయత కలిగిన పాస్‌పోర్టు పొందెందుకు (ఏ1 నుంచి ఏ23 ) ఆమె 2 లక్షల రూపాయలు చెల్లించింది. ఈ కేసులో ఏ1 నుంచి ఏ23 వరకు ఉన్న నిందితులందరూ కలిసి నకిలీ పాస్‌పోర్టు తయారు చేసే ప్రక్రియను పూర్తి చేశారు. తద్వారా ఆమెకు భారత పాస్‌పోర్టు లభించింది. నకిలీ పత్రాలతోపాటు చిరునామా ఇ.నం.7-1-302-17, జి1, యుషిత రెసిడెన్సీ, బీకే గూడ, ఎస్ఆర్నగర్ను సైతం ఫేక్‌గా నమోదు చేశారు. నకిలీ పత్రాల ఆధారంగా పాస్‌పోర్టులకు దరఖాస్తులు చేసుకున్నారు. భారత్ పాస్‌పోర్టు లభించడంతో ఆమె వీసాతో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నదని, నకిలీ పత్రాలతో చాలా సంఖ్యలో పాస్‌పోర్టులో పొందారంటూ అధికారులు కోర్టులో దాఖలు చేసిన కౌంటర్లో పేర్కొన్నారు. నిందితురాలు బెయిల్‌పై విడుదలైతే నకిలీ పత్రాల ద్వారా విదేశాలకు వెళ్లే అవకాశం ఉన్నదని వివరించారు.