Hyderabad | మారేడ్‌పల్లి, మార్చి 25 : ఎంఎంటిఎస్ రైల్లో యువతిపై జరిగిన లైంగిక దాడి ప్రయత్నం కేసులో సికింద్రాబాద్, సైబరాబాద్, ఎస్వోటీ, సీసీఎస్, జీఆర్పీ పోలీసులు సంయుక్తంగా నిందితుడి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తం 13 బృందాలతో నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సుమారు 200లకు పైగా సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి గుండ్లపోచంపల్లి వరకు 14 రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలను పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి జల్లెడ పడుతున్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో సిసి కెమెరాలు లేకపోవడంతో నిందితుడిని గుర్తించడంలో కొంత జాప్యం జరుగుతుంది. అల్వాల్ రైల్వే స్టేషన్ వద్ద మహిళా కోచ్‌లోకి నిందితుడు వచ్చినట్లు గుర్తింపు పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. ఇప్పటికే పలువురు పాత నేరస్తుల ఫొటోలు భాధిత యువతికి చూపించగా నిందితుడిని గుర్తించలేదు.