సిటీబ్యూరో, మార్చి 30(నమస్తే తెలంగాణ): ఎంఎంటీఎస్ ఘటన జరిగి సరిగ్గా పది రోజులైంది. ఈనెల 22వ తేదీన ఎంఎంటీఎస్ రైలులో జరిగిన అత్యాచారయత్నం ఘటన మిస్టరీ ఇంకా వీడలేదు. ఇప్పటికీ పోలీసుల దర్యాప్తు కొనసాగుతూనే ఉన్నది. అనుమానితుల గుర్తింపు దగ్గరే దర్యాప్తు ఆగిపోయిందని పోలీసు అధికారులు చెబుతున్నారు. అసలు అనుమానితుడుగా చెబుతున్న వ్యక్తికి ఈ ఘటనకు సంబంధం ఉందా? లేదా? అనే కోణంలో పోలీసుల విచారణ జరుగుతున్నది.
ఘటన జరిగిన రెండురోజుల తర్వాత అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ తర్వాత పలు కారణాల వల్ల నిందితులెవరనేది తేల్చుకోలేకపోతున్నారు. తాము అనుమానితుడుగా పట్టుకున్న వ్యక్తి విషయంలో ఘటనలో ఉన్నాడా? లేదా? అనే విషయం కూడా పోలీసులకు స్పష్టత లేదు. మరోవైపు పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విస్తృతంగా తనిఖీలు చేపట్టినా సమస్య కొలిక్కి రావడం లేదు. సుమారు రెండు వందల మంది పోలీసులు ఈ ఘటన మిస్టరీని ఛేదించడానికి పనిచేస్తున్నారు. అయినా ఫలితం లేకుండా పోతుందని పోలీసులే చెబుతున్నారు.
పోలీసులకు అడ్డంకిగా మూడు సమస్యలు
బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆమె నుంచి తీసుకున్న వాగ్మూలం, ఆ తర్వాత అనుమానితుల ఫొటోలు చూపిస్తే అందులో ఇద్దరిని అనుమానించడం, ఆ ఇద్దరు అనుమానితులను తీసుకొచ్చి చూపిస్తే వారిలో ఒకరిని చూపించి ఇతనే అని చెప్పడంతో ఘటన ఓ కొలిక్కి వచ్చిందనుకున్నారు పోలీసులు. కానీ మళ్లీ అనుమానితుడి విషయంలో అతను పూర్తిగా మత్తుకు బానిస కావడంతో పాటు అతడికి ఫోన్ కూడా లేకపోవడం, చిన్నచిన్న నేరాలకు పాల్పడే పాత నేరస్తుడు కావడంతో పోలీసులు మొదట అతడే నిందితుడనుకున్నారు.
కానీ అతనే అని నిర్ధారించడానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ దొరకకపోగా, అసలు అతడు ఎంఎంటీఎస్‌లో ప్రయాణించాడనడానికి ఆధారాలు కూడా లేకపోవడంతో దర్యాప్తు మళ్లీ మొదటికి వచ్చిందని పోలీసులు చెప్పారు. అయితే బాధితురాలు ముఖానికి, తలకు బలమైన గాయాలు కావడం, పళ్లు ఊడిపోవడంతో ఆమె ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. ఇప్పటికే ఆమెకు పలు శస్త్ర చికిత్సలు జరిగాయి. దీంతో ఆమె పోలీసులతో ఘటనకు సంబంధించి వివరంగా మాట్లాడలేకపోతుందని పోలీసులు చెప్పారు. ఘటన మిస్టరీని ఛేదించడంలో పోలీసులకు మూడు సమస్యలు అడ్డంకిగా మారుతున్నాయి.
ఒకటి ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడం, మరొకటి ప్రత్యక్ష సాక్షులు ఒక్కరు కూడా లేకపోవడంతో అనుమానితుడిని నిందితుడిగా ఎలా నిర్ధారించాలో తేల్చుకోలేక, అతడి విషయంలో స్పష్టత రాక ఇంకా ఈ ఘటన చిక్కుముడి వీడటం లేదు. మూడవది ప్రధానంగా బాధితురాలు ఘటన గురించిన స్పష్టంగా వివరాలు చెప్పలేకపోవడం వల్ల కేసు చిక్కుముడి వీడటం లేదు. ఆమె పూర్తిగా కోలుకొని ఘటనపై వివరాలు చెబితే తప్ప కేసు ముందుకు సాగేలా లేదని దర్యాప్తు బృందంలో ఉన్న ఓ అధికారి చెప్పారు.