మైలార్‌దేవ్‌పల్లి, సెప్టెంబర్ 27: భర్త, అత్తామామలు పెడుతున్న వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ పి.నరేందర్ కథనం ప్రకారం.. పద్మశాలిపురానికి చెందిన ముఖేశ్ భాఠి (32), పూజ భాఠి(31) దంపతులు. వీరికి ఇద్దరు సంతానం.
ఇంట్లో వీరితో పాటు అత్తామామలు బాల్కిషన్ భాఠి, చంపా భాఠి ఉంటున్నారు. ముఖేశ్ బేగంబజార్‌లో డ్రై ఫ్రూట్స్ వ్యాపారి. పూజ తల్లిదండ్రులు కూడా ఆమె ఇంటి ఆవరణలోనే ఉంటున్నారు. ఇదిలా ఉండగా.. ముఖేశ్, పూజ కాపురం.. వివాహమైన కొద్ది రోజులు మాత్రమే సజావుగా సాగింది. ఆ తర్వాత నిత్యం ముఖేశ్ గంజాయి, డ్రగ్స్, మద్యం సేవించి ఇంటికి వచ్చి.. తల్లిదండ్రుల ఎదుటే భార్యను చిత్రహింసలు పెట్టాడు. అత్తామామ కూడా ముఖేశ్‌కు లేనిపోని మాటలు చెప్పి.. అతడిని మరింత రెచ్చగొట్టారు.
అనుమానంతో ముఖేశ్.. భార్యను ఇంట్లో పెట్టి బయట నుంచి తాళంవేసి వెళ్లేవాడు. గొడవ పడొద్దని పలుమార్లు కుల పెద్దలు కూడా నచ్చజెప్పారు. అయినా, ముఖేశ్లో మార్పు రాలేదు. గురువారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మనస్తాపం చెందిన ఆమె అదే రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.