మన్సురాబాద్, ఏప్రిల్ 10: నగరం నడిరోడ్డుపై కొందరు దుండగులు ఓ మహిళను కత్తితో పొడిచారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ మహిళ దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. బడంగ్ పేట లోని సబితా ఇంద్రారెడ్డి నగర్ కాలనీకి చెందిన లక్ష్మి (40) సోమవారం సాయంత్రం పని నిమిత్తం ఎల్బీనగర్కు వచ్చింది.
ఈనెల 8న సోమవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇంటికి వెళ్లేందుకు ఆమె ఎల్బీనగర్, దానాపూర్ రోడ్డు లోని రిషి కిచెన్ సమీపంలో నిల్చున్నది. రోడ్డుపై నిల్చున్న ఆమె వద్దకు వచ్చిన కొందరు వ్యక్తులు లక్ష్మితో గొడవకు దిగారు. ఇరువురి మధ్య వాగ్వాదం పెరిగి విచక్షణ కోల్పోయిన సదరు వ్యక్తులు నడిరోడ్డుపై కత్తితో లక్ష్మి కడుపు, ఎద, ముఖంపై విచక్షణారహితంగా పొడిచి అక్కడి నుంచి పారి పోయారు. ఈ ఘటనలో లక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆమె రక్తపు మడుగులో పడి ఉండగా అటువైపుగా వచ్చిన ఓ రిక్షా డ్రైవర్ గమనించాడు. ఆమెను గుర్తుపట్టి సమీప బంధువుకు విషయాన్ని తెలిపాడు. వరలక్ష్మిని దిల్సుఖ్నగర్లోని కృతిక దవాఖానకు చికిత్స నిమిత్తం తరలించారు. తీవ్ర గాయాలతో 3 రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన లక్ష్మి బుధవారం అర్ధరాత్రి దాటినా అనంతరం మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. మృతురాలి అల్లుడు బాబు నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు..మహిళపై కత్తితో దాడికి పాల్పడిన నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.