సుల్తాన్‌బజార్, మార్చి 7: గాంధీనగర్ పోలీసులు వేధిస్తున్నారని నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని కవాడిగూడకు చెందిన శ్రావణి ఆత్మహత్యకు యత్నించింది. కమిషన్ వద్ద విధుల్లో ఉన్న పోలీసులు వెంటనే తేరుకొని బాధితురాలు శ్రావణిని అడ్డుకొని ఆమె చేతిలోని పెట్రోల్ బాటిల్‌ను లాక్కున్నారు. సదరు మహిళను కమిషన్ ఛైర్మన్ వద్దకు తీసుకువెళ్లగా, మహిళపై పోలీసుల దాడి ఆరోపణలపై మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకొని కమిషన్ ఛైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించడం, దౌర్జన్యంపై దాఖలైన ఫిర్యాదును సుమోటోగా స్వీకరించి విచారణ ప్రారంభించారు.
ఈ ఫిర్యాదులో సదరు మహిళ అనుమానిత దొంగతనం కేసుపై శారీరకంగా దాడి చేశారని, అసభ్య పదజాలం, అవమానకరమైన భాషలో దూషించారని, బెదిరించడంతో పాటు తన ఫొటోతో అపార్ట్మెంట్లో ప్రచారం చేసి గౌరవాన్ని దెబ్బతీయడంతో తాను తీవ్రమైన మానసిక క్షోభకు, అవమానానికి గురయ్యానని ఆరోపించింది. దీంతో సవివరమైన నివేదిక సమర్పించాలని నగర పోలీస్ కమిషనర్‌కు కమిషన్ సిఫారసు చేసింది. ఈ నెల 30వ తేదికి కేసు వాయిదా వేస్తున్నట్లు కమిషన్ పేర్కొంది.