మణికొండ, జూన్ 22 : నగరవాసులను వీధి కుక్కలు వణికిస్తున్నాయి. దొరికిన వారిని దొరికినట్లు కరిచి వేస్తున్నాయి. చిన్నా,పెద్దా అనే తేడాలేకుండా.. అందరినీ హడలెత్తిస్తున్నాయి. తాజాగా ఓ మహిళపై ఏకంగా 15 శునకాలు దాడికి దిగాయి. వాటి నుంచి ఆ మహిళ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. చిత్రపురికాలనీ ఎంఐజీ బ్లాక్-6లో నివాసముంటున్న తెలుగు సినిమా స్టంట్ మాస్టర్ బద్రీ సతీమణి రాజేశ్వరి ఉదయం కాలనీలో వాకింగ్ కోసమని ఇంటి నుంచి బయలుదేరారు. ఒంటరిగా వెళ్తున్న ఆమెపై దాదాపు 15 కుక్కలు వెంబడించి.. కరిచేందుకు ప్రయత్నించాయి.
పరిస్థితిని గమనించిన రాజేశ్వరి.. దాదాపు అరగంట పాటు కుక్కలను తరిమేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నించారు. ఇంతలో ఓ ద్విచక్రవాహనదారుడు, కారు రావడంతో కుక్కలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. కాగా, వీధి కుక్కలు వెంటపడి..కరిచేందుకు యత్నించిన దృశ్యాలు..సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ దృశ్యాలను..రాజేశ్వరి భర్త బద్రీ.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇంత దారుణంగా చిత్రపురికాలనీలో కుక్కలు వీరంగం సృష్టిస్తున్నాయని, అనేక సార్లు స్థానిక మున్సిపాలిటీ అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా.. ఎవరూ పట్టించుకోలేదని ఆయన వాపోయారు. అధికారులు ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రశ్నించారు.
‘నా భార్య అరగంటపాటు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని.. ప్రతిఘటించడంతో వీధి కుక్కల బారి నుంచి ప్రాణాలతో బయటపడిందం’టూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరి ప్రాణాలైన పోయిన తర్వాతే అధికార యంత్రాంగం స్పందిస్తుందేమోనంటూ మండిపడ్డారు. కాగా, కుక్కల దాడి దృశ్యాలు వైరల్గా మారడంతో నెటిజన్లు సైతం తీవ్రస్థాయిలో స్పందించారు. చిత్రపురికాలనీలో జరిగిన ఘటన చూస్తే భయాందోళన కలుగుతున్నదని, ఇదే పరిస్థితి చిన్నారులకు ఎదురైతే ప్రాణాలు పోయేవన్నారు. మణికొండ మున్సిపాలిటీలో అధికార యంత్రాంగం పనిచేస్తోందా? అని ప్రశ్నించారు.