Concept One Developers | బంజారాహిల్స్: ఫ్లాట్ పేరుతో తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగేందుకు ఆఫీసుకు వచ్చిన మహిళ పట్ల రియల్ ఎస్టేట్ సంస్థ డైరెక్టర్‌తో పాటు మరో వ్యక్తి అసభ్యకరంగా మాట్లాడడంతోపాటు దాడికి పాల్పడ్డారు. ఫిలింనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మణికొండ ఓయూ కాలనీలో నివాసముంటున్న మహిళ(36) ఓ ప్రైవేటు స్కూల్ ప్రిన్స్‌పాల్‌గా పనిచేస్తున్నారు. ఆరునెలల కిందట ఇన్స్టాగ్రామ్ ద్వారా టోలీచౌకి ప్రధాన రహదారిపై ఉన్న కాన్సెప్ట్ వన్ డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ గురించి తెలుసుకుని..నెక్నాంపూర్లో ఆ సంస్థ నిర్మిస్తున్న అపార్ట్మెంట్లో ఫ్లాట్ బుక్ చేసుకున్నారు. గత ఏడాది అగస్ట్లో అడ్వాన్స్‌గా రూ.8లక్షలు చెల్లించారు.
కాగా.. డిసెంబర్లో నెక్నాంపూర్‌లోని తమ ప్రాజెక్టును నిలిపివేశామని, తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తామని సంస్థ ప్రతినిధులు చెప్పారు. మొదట రూ.3లక్షలు మాత్రమే ఇచ్చి.. ఆ తర్వాత ఫోన్లు ఎత్తడంలేదు. దీంతో గురువారం సాయంత్రం టోలీచౌకిలోని కాన్సెప్ట్ ఓన్ డెవలపర్స్ సంస్థ కార్యాలయానికి భర్తతో కలిసి బాధిత మహిళ వెళ్లి డబ్బులు అడిగారు.
అక్కడి ఉద్యోగి అమేశ్ జాబ్రి అసభ్యంగా మాట్లాడాడు. అలాగే సంస్థ డైరెక్టర్ అబ్దుల్ రబ్ బిన్ అబ్దుల్లా కూడా అలాగే మాట్లాడి బాధిత మహిళ చెంపపై కొట్టాడు. దీంతో ఆమె భర్త అడ్డుకోవడానికి ప్రయత్నించగా అతడిపై సైతం దాడి చేశారు. ఈ మేరకు బాధితురాలు శుక్రవారం ఉదయం ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంస్థ డైరెక్టర్ అబ్దుల్ రబ్ బిన్ అబ్దుల్లా, అమేశ్ జాబ్రిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.