దుండిగల్, డిసెంబర్ 8: వెనుకనుండి వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ లారీ ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. టిప్పర్‌లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమదానికి కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటన సూరారం పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం వెంకట్రాంనగర్లో నివాసముంటున్న శ్రీకాంత్, కే.జ్యోతి(35) దంపతులు.. చింతల్‌లోని ఓ ప్రైవేట్ షాపింగ్‌మాల్‌లో పనిచేసేవారు. ఏడాదికిందట సూరారం వెంకట్రాంనగర్లోని ఓ ఇంటిని కిరాయికి తీసుకుని నివాసముంటున్నారు.
ప్రైవేట్ ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం సరిపోవడం లేదని భావించిన దంపతులు మూడు నెలల క్రితం, దుండిగల్ సర్కిల్ పరిధి, బహదూర్‌పల్లిలోని విల్లాల వద్ద కిరాణషాపు ఏర్పాటు చేసుకుని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో కిరాణషాపును తెలిచేందుకు వెంకట్రాంనగర్లోని ఇంటినుండి జ్యోతి ర్యాపిడో బైక్‌ను బుక్‌చేసి, దానిపై బయలు దేరింది. కొద్ది నిమిషాల తర్వాత బైక్ సూరారం జ్యోతిమిల్క్ (హ్యాట్సన్) పరిశ్రమ వద్దకు చేరుకోగానే వేగంగా దూసుకొచ్చిన టిప్పర్‌లారీ వెనుకనుండి బలంగా ఢీ కొట్టింది.
దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న జ్యోతితోపాటు ర్యాపిడోబైకర్ సూరారం కాలనీ, పాండు బస్తీకి చెందిన కొప్పుల సురేందర్‌రెడ్డి(45) రోడ్డుపై పడిపోవడంతో టిప్పర్ లారీ ముందు టైర్లు వారిద్దరిపై నుండి దూసుకెళ్లాయి. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. టిప్పర్‌లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతోపాటు మితిమీరిన వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. ఆయా కుటుంబాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా సురేందర్‌రెడ్డి సైతం జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఓ కంపెనీలో పనిచేసే వాడని, అయితే ఇటీవలే కంపెనీలో పనిమానేసి ర్యాపిడో బైక్ నడుపుకుంటూ ఉపాధి పొందుతున్నట్లు స్థానికులు చెప్పారు. మృతుడికి భార్య లావణ్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు.