మియాపూర్, మార్చి 20: మౌలిక వసతుల కల్పనతో పాటు పచ్చదనం పెంపుతో ఐటీ పరిసరాలైన శేరిలింగంపల్లి జోన్ మరింత శోభను సంతరించుకోనున్నాయి. ఇప్పటికే పచ్చదనం పరుచుకుని జోనల్ కార్యాలయం ఐఎస్వో ధృవీకరణను పొందగా…అంతటితోనే ఆగకుండా కాలనీలలోనూ అదేతరహాలోనే సుందరీకరించేలా ముమ్మర ప్రయత్నాలను చేస్తున్నారు. సింహభాగం ఐటీ పరిశ్రమలకు వేదికగా ఉన్న శేరిలింగంపల్లి జోన్లో విభిన్నమైన థీమ్ పార్కులు శరవేగంగా సిద్ధం అవుతున్నాయి. వారాంతపు రోజులలో హాల్స్ మాల్స్‌కు పరుగులు తీస్తున్న నగర ప్రజానీకానికి అందుకు ప్రత్యాన్మాయంగా అందంగా ఆహ్లాదాన్నందించేలా థీమ్ పార్కులను తీర్చిదిద్దుతున్నారు. కేవలం పచ్చదనమే కాకుండా ఆలోచనాత్మకంగా ఉండేలా అవి తయారవుతున్నాయి. జోన్ పరిధిలో నాలుగు సర్కిళ్లలో కలిపి మొత్తం 10 థీమ్ పార్కులను అభివృద్ధి పరుస్తున్నారు. వాటిలో ఇప్పటికే కొన్ని పూర్తయి ప్రారంభానికి సిద్ధం కాగా..మిగిలిన వాటిని ఈ ఏడాది జులైలోగా పూర్తి చేసేలా యుద్ధ ప్రాతిపదికన పనులను చేపడుతున్నారు. యూబీడీ విభాగం ఆధ్వర్యంలో తీర్చిదిద్దుతున్న ఈ పనులను ఎప్పటికపుడు జోనల్ కమిషనర్ శంకరయ్య పరిశీలిస్తూ పలు సూచనలనందిస్తున్నారు.
శేరిలింగంపల్లి జోన్ వ్యాప్తంగా విభిన్నమైన థీమ్‌లతో 10 వరకు థీమ్ పార్కులను తీర్చిదిద్దుతున్నారు. రోజువారీ పార్కులకు భిన్నంగా ఎంతో అందంగా..ఆకర్షనీయంగా..ఆహ్లాదకరంగా..పచ్చదనం..ఆలోచనాత్మకంగా తయారవుతున్నాయి. రూ. 24 కోట్ల నిధులతో వాటిని అభివృద్ధి పరుస్తున్నారు. ఇల్యుషన్ పార్కు, ఇంటరాక్టివ్ సైన్స్ పార్కు, ఎకో సెంట్రిక్ థీమ్ పార్కు, ఇంటిగ్రిటీ థిమ్ పార్కు, చిల్డ్రన్స్ పార్కు, ఉమెన్స్ థీమ్ పార్కు, సైన్స్ థీమ్ పార్కు, సవర్ణ పార్కు, మల్టీ జనరేషన్ పార్కులను తీర్చిదిద్దుతున్నారు. ఇందులో మల్టి జనరేషన్, ఇంటిగ్రిటి, ఇంటరాక్టివ్ పార్కు నిర్మాణాలు పూర్తయి ప్రారంభానికి సిద్ధం అయ్యాయి. మిగిలిన వాటిని ఈ ఏడాది జులై వరకు పూర్తి చేసే లక్ష్యంతో అధికారులు పని చేస్తున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ జోన్లో రూపొందుతున్న పార్కులను ఇప్పటికే జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు పరిశీలించి అధికారులను అభినందించారు. ప్రధానంగా పచ్చదనం పరిఢవించేలా యూబీడీ విభాగం ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని జడ్సీ శంకరయ్య తెలిపారు.