సిటీబ్యూరో/బడంగ్‌పేట/ మణికొండ, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థల విలీన ప్రక్రియ పూర్తి కావడంతో రికార్డుల స్వాధీనం చకచకా జరుగుతున్నది. డిప్యూటీ కమిషనర్లకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించి శుక్రవారం (నేటి)లోగా పూర్తి చేయాలని కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. గడిచిన రెండు రోజులుగా ఆయా పురపాలికల్లో సందడి నెలకొంది. పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన మినిట్స్ బుక్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఖాతాల్లో ఉన్న బ్యాలెన్స్‌ను జీహెచ్ఎంసీ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసి అక్కడ కొనసాగుతున్న బ్యాంకు ఖాతాలను క్లోజ్ చేస్తున్నారు.
భవనాలు, ఉద్యోగుల వివరాలకు సంబంధించి 9 రకాల ప్రోఫార్మాను సూచించగా, అందుకు అనుగుణంగా అర్బన్ లోకల్ బాడీ ప్రొఫైల్, పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు, స్థిరాస్తుల వివరాలు, చరాస్థులు, అప్పటి వరకు ఉన్న డిపాజిట్లు, పెట్టుబడులు, పన్నులు, పన్నులు కానీ వాటి డిమాండ్, కలెక్షన్, బ్యాలెన్స్, కొనసాగుతున్న పథకాల వివరాలు, చెల్లించాల్సిన పనుల బిల్లులు, సామగ్రి బిల్లులు, గత మూడు సంవత్సరాలలో జారీ చేయబడిన భవనాల అనుమతులు, లే అవుట్ల అనుమతుల వివరాలను సేకరిస్తున్నారు. అయితే సందట్లో సడేమియాల కొందరు ఫైళ్లను చక్కపెడుతున్నట్లు అరోపణలు వినిపిస్తున్నాయి. నిజాంపేట, బడంగ్‌పేట, నార్సింగి ఇతర పురపాలికల్లో అర్ధరాత్రి వరకు కాంట్రాక్టర్లతో అధికారులు మిలాఖత్ అవుతూ బిల్లులను క్లియర్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అందినంత దండుకుని అసెస్మెంట్ చేసి ఇంటి నంబర్లను ఇస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా పాత తేదీలతో అక్రమ నిర్మాణాలకు అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
అధికారులు.. కాంట్రాక్టర్ల మంతనాలు
మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో ఉన్న మీర్‌పేట, బడంగ్‌పేట కార్పొరేషన్లతో పాటు తుక్కుగూడ, జల్పల్లి మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో అధికారులు బుధవారం రాత్రి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్, జల్పల్లి మున్సిపాలిటీని చార్మినార్ జోన్లో విలీనం చేశారు. తుక్కుగూడ మున్సిపాలిటీని, మీర్‌పేట కార్పొరేషన్‌ను ఎల్బీనగర్ జోన్లో విలీనం చేశారు. అధికారులు అర్ధరాత్రి వరకు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అధికారులతో పాటు కాంట్రాక్టర్లు అర్ధరాత్రి వరకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల్లో ఉండటంతో అనేక అనుమానాలకు తావు ఇస్తున్నది.
ఒక రోజు ముందే మున్సిపాలిటీలలో, కార్పొరేషన్లలో లావాదేవీలు నిలిపివేయాలని జీహెచ్ఎంసీ అధికారులు ఆదేశాలు జారీ చేసిన్నప్పటికీ మున్సిపల్ అధికారులు కాంట్రాక్టర్లకు చెక్కులు జారీ చేసినట్లు తెలిసింది. కొంత మంది కాంట్రాక్టర్లకు చెక్కులు ఇచ్చి మరి కొంత మందికి చెక్కులు ఇవ్వక పోవడంతో రాత్రి సమయంలో గందరగోళం నెలకొందని ప్రచారం సాగుతున్నది. రికార్డులను మార్చి చెక్కులు జారీ చేశారన్న వదంతులు రావడంతో రాత్రి చాలా మంది కాంట్రాక్టర్లు బడంగ్‌పేట కార్యాలయానికి వచ్చారు. వచ్చిన అధికారులతో మాట్లాడి చేయని పనులకు కూడా చెక్కులు జారీ చేసినట్లు తెలిసింది. అర్ధరాత్రిలో అధికారులు , కాంట్రాక్టర్లు మంతనాలు జరిపారు. అధికారులు ఇష్టాను సారంగా ఇచ్చిన చెక్కుల వ్యవహారం పై జీహెచ్ఎంసీ అధికారులు దృష్టి పెట్టాలని కోరుతున్నారు.
వార్డుల పునర్విభజనపై డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌కు కసరత్తు
విలీన ప్రక్రియ నేపథ్యంలో ఆయా పురపాలిక రికార్డుల స్వాధీనం శుక్రవారం సాయంత్రంతో ముగియనున్నందున, ఈ విలీన స్థానిక సంస్థలను కలుపుకుని మొత్తం 300 పై చిలుకు మున్సిపల్ వార్డులుగా పునర్విభజించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. విలీనమైన స్థానిక సంస్థలను ప్రస్తుతం సరిల్స్గా పరిగణించిన జీహెచ్ఎంసీ వాటిలోని జనాభా, విస్తీర్ణాన్ని కూడా పరిగణలోకి తీసుకుని మున్సిపల్ వార్డులుగా పునర్విభజించి నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.
నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత డీలిమిటేషన్ డ్రాఫ్ట్ పై వారం రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించి, వాటిని పరిషరించిన తర్వాతే ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలని జీహెచ్ఎంసీ భావిసున్నది. ఈ మొత్తం ప్రక్రియను ఈ నెల 27వ తేదీలోపు ముగించాలని జీహెచ్ఎంసీ డెడ్ లైన్ కూడా పెట్టుకున్నట్లు సమాచారం. ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత జనవరిలో జరగనున్న కౌన్సిల్ సమావేశంలో డీలిమిటేషన్ ఫైనల్ నోటిఫికేషన్‌కు ఆమోదం తీసుకున్న అనంతరం సరారుకు పంపాలని జీహెచ్ఎంసీ భావిస్తున్నట్లు తెలిసింది.
డీ లిమిటేషన్ ఇలా ఉండే అవకాశం
625 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలోనున్న 150 వార్డులను సుమారు 250 వార్డులుగా పునర్విభజించిన తర్వాతే ప్రతిపాదిత 27 లోకల్ బాడీలను మరో 50 వార్డులుగా విభజించే ప్రక్రియ చేపట్టాలని సరారు సూచించినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం 650 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన జీహెచ్ఎంసీలోకి 20 మున్సిపాలిటీలను విలీనం చేస్తుండటంతో అందులోనున్న 407 వార్డులు, 714.18 కిలోమీటర్ల విస్తీర్ణంతో పాటు 10 లక్షల 49 వేల 357 మంది జనాభా జీహెచ్ఎంసీ పరిధిలోకి రానుంది. వీటితో పాటు మరో ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల విలీనంలో భాగంగా అదనంగా మరో 215 వార్డులు, ఏరియా 233.98 కిలోమీటర్లతో పాటు పది లక్షల 78 వేల 501 మంది జనాభా జీహెచ్ఎంసీ పరిధిలోకి రానున్నారు.
27 లోకల్ బాడీల విలీనం తర్వాత జీహెచ్ఎంసీ పరిధిలో 2011 జనాభా లెకలకు తోడు ప్రస్తుత అంచనా లెకల ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిని కలుపుకొని మొత్తం తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో సుమారు కోటి 30 లక్షల పై చిలుకున్నట్లు అధికారులు సీజీజీ ద్వారా సమాచారం సేకరించినట్లు తెలిసింది. విలీనం తర్వాత తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ విస్తీర్ణం సుమారు 1572.98 కిలోమీటర్లకు పెరగనున్నది. ఈ మొత్తం విస్తీర్ణంలోని ప్రతి 40 వేల జనాభాకు ఒక వార్డును ఏర్చాటు చేసే దిశగా పునర్విభజన ప్రక్రియ కొనసాగుతున్నది. ఒక వార్డును పునర్విభజించేందుకు ఆ ప్రాంతంలోనే నాలాను, మెయిన్ రోడ్డును గానీ ల్యాండ్ మార్గా తీసుకుని అకడి నుంచి 40 వేల జనాభా ఉన్న వరకు మారింగ్ చేసుకుని మున్సిపల్ వార్డుగా ఫిక్స్ చేస్తున్నట్లు సమాచారం. 10 జోన్లు..50 సర్కిళ్లుగా చేసే అవకాశాలున్నాయన్న చర్చ జరుగుతున్నది.
విలీన పురపాలికలపై జీహెచ్ఎంసీ పేరుతో బోర్డులు
ఆయా పురపాలిక కార్యాలయాల పేర్లను మార్చి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పేరిట బోర్డులను అమర్చారు. పరిపాలన వ్యవహారాలు జోనల్ కమిషనర్ ఆదేశాల మేరకు డిప్యూటీ కమీషనర్ల విధులు నిర్వహించాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీ సర్కిళ్లుగా గుర్తిస్తూ సర్కిళ్ల నంబర్లను కేటాయించలేదు. పరిపాలన ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత సర్కిల్ నంబర్లను కేటాయించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అప్పటి వరకు ప్రజలకు సౌకర్యాలను కల్పించాల్సిన నిధుల వెచ్చింపులు, అనుమతులు మంజూరు, పారిశుధ్యం, ఇంజినీరింగ్ వ్యవస్థలు జీహెచ్ఎంసీ విధివిధానాలతో కొనసాగించనున్నారు. పరిపాలన వ్యవహారాలన్నీ సరిదిద్దుకోవడానికి పదిరోజుల కాల వ్యవధి పట్టే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.