మేడ్చల్, సెప్టెంబర్5, (నమస్తే తెలంగాణ): అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారా? అంటూ మున్సిపాలిటీల పరిధిలోని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 16 మున్సిపాలిటీలు ఉండగా 13 మున్సిపాలిటీలలో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి రూ. 20 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించినప్పటికీ ఇప్పటి వరకు నిధులు మంజూరు కాలేదు. దీంతో మున్సిపాలిటీల పరిధిలో సమస్యలు ఎక్కడి అక్కడే ఉన్నాయి.
సమస్యలపై స్థానికులు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోతోంది. దీంతో తాము ఎదుర్కోంటున్న సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. నిధుల కోసం ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించామని, నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తామని ప్రజలను అధికారులు తిప్పి పంపుతున్నారు. స్థానికులు పడుతున్న ఇబ్బందులపై మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణిలో ఫిర్యాదులు చేయాల్సిన పరిస్థితి ఏర్పాడిందని స్థానికులు వాపోతున్నారు.
శివారు మున్సిపాలిటీలలో…
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని శివారు మున్సిపాలిటీలలో నిధుల లేమితో ఎలాంటి సమస్యలను మున్సిపల్ అధికారులు పరిష్కరించలేకపోతున్నారు. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఉన్న మున్సిపాలిటీల పరిధిలో వివిధ జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ స్థిరపడుతున్నారు. దీంతో అనేక మున్సిపాలిటీల పరిధిలో నూతన కాలనీలు ఏర్పడుతున్నాయి.
నూతన కాలనీలలో డ్రైనేజీ, సీసీరోడ్లు. మంచినీటి సౌకర్యం, విద్యుత్ దీపాలు తదితర అవసరాల కోసం గత ఏడాది మేడ్చల్, గూండ్లపోచంపల్లి, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్కేసర్, తూకుంట, దుండిగల్, కొంపల్లి, నిజాంపేట్, జవహర్‌నగర్, బొడుప్పల్, పీర్జాదిగూడలలో వివిధ అభివృద్ధి పనుల కోసం ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించారు. అయితే నేటి వరకు నిధుల మంజూరుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో సమస్యలతో స్థానికులు సతమతమవుతున్నారు.
మున్సిపాలిటీలకు నిధులు మంజూరు కాకపోవడంతో ఆస్తిపన్నులు, ట్రెడ్ లైసెన్స్‌లతో వచ్చిన ఆదాయంతోనే మున్సిపాలిటీల నిర్వహణను కొనసాగిస్తున్నారు. ప్రభత్వం నిధులు మంజూరు చేస్తే తప్ప మున్సిపాలిటీలలో నూతనంగా ఏర్పడుతున్న కాలనీలలలో మౌళిక వసతులను కల్పించే పరిస్థితి లేదు. మున్సిపల్ అధికారులు ప్రతిపాదించిన నిధులైన మంజూరు చేస్తే కొన్ని సమస్యలు పరిష్కరయ్యే అవకాశం ఉంటుందని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు.