2008 నాటి వాటర్బెల్ట్ జీవోను వెనక్కి తీసుకునేలా యత్నిస్తాం
సరూర్‌నగర్ చెరువు చుట్టూ వాన నీరు నిలవకుండా కొత్త డ్రైనేజీ వ్యవస్థ
కాలనీవాసులకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ సుధీర్‌రెడ్డి హామీ
ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
రంగారెడ్డి జిల్లా జేసీ ప్రతీక్ జైన్‌కు
గ్రీన్ పార్కు కాలనీ సమస్యలను విన్నవించిన ఎమ్మెల్యే
ఎల్బీనగర్, ఏప్రిల్ 2: సరూర్‌నగర్ చెరువు సమీపంలోని లింగోజిగూడ డివిజన్ గ్రీన్ పార్కు కాలనీలో వాటర్ బెల్ట్ జీవోను ఉపసంహరించేలా ప్రయత్నిస్తానని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. గ్రీన్ పార్కు కాలనీవాసులు మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావుతో కలిసి రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను కలిసి సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ గ్రీన్ పార్కు కాలనీ ఎఫ్టీఎల్ వివాదంపై గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిశామని తెలిపారు. కలెక్టర్ స్పందించి జాయింట్ కలెక్టర్‌ను సమస్యలను పరిశీలించాలని సూచించినట్టు తెలియజేశారు. ఈ మేరకు జేసీని కలిసి గ్రీన్ పార్కు కాలనీ సమస్యను పరిష్కరించాలని కోరామన్నారు.
గ్రీన్ పార్కు కాలనీ సమస్యను పరిశీలించి జేసీ రిపోర్టు తెప్పించుకున్నారని, గతంలో 2008లో గ్రీన్ పార్కు కాలనీ చెరువుపై ‘వాటర్ బెల్ట్’ అని జీవో తీసుకువచ్చినట్టు తెలిపారు. ఈ జీవో నేపథ్యంలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్, బఫర్ జోన్ బయట ఉన్న ప్రాంతాలకు అనుమతులు రావడం లేదన్నారు. జేసీ సూచనల మేరకు ప్రభుత్వానికి విన్నవించి వాటర్ బెల్ట్ జీవోను ఉపసంహరణ చేసుకునే విధంగా ప్రయత్నిస్తామని తెలిపారు. వాస్తవంగా గ్రీన్ పార్కు కాలనీలో వర్షపు నీరు నిలువకుండా బండ్ నిర్మాణం చేసి కొత్త డ్రైనేజీ వ్యవస్థ కూడా నిర్మిస్తామని తెలిపారు. గ్రీన్ పార్కు కాలనీవాసులకు మేలు జరిగే విధంగా తగు చర్యలు తీసుకుంటామని, ఎవ్వరు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ పార్కు కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కమలేశ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బాల్‌రెడ్డి, కోశాధికారి నర్సిరెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీదేవి, రవీందర్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు కొంగర జగన్‌రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు గువ్వల వెంకట్‌రెడ్డి, సలహాదారులు రామయ్య తదితరులు పాల్గొన్నారు.