మారేడ్‌పల్లి, జూలై 3: కంటోన్మెంట్ నాలుగో వార్డు ఎల్ఐసీ కాలనీలో భర్త ఆస్తి హక్కుల కోసం ఓ ఎన్నారై భార్య తన కుమార్తెతో కలిసి అత్తగారి ఇంటి ముందు ధర్నాకు దిగింది. కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌కు చెందిన లక్ష్మి అలియాస్ రజితకు మారేడ్‌పల్లి ఎల్ఐసీ కాలనీకి చెందిన రాముతో వివాహం జరిగింది. అనంతరం దంపతులు అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.
వీరికి త్రిష అనే కుమార్తె ఉంది. కాగా రాము అనారోగ్యంతో 2023 సంవత్సరంలో మృతి చెందాడు. ఇటీవల రాము కుటుంబ సభ్యులు రెవెన్యూ శాఖ నుంచి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ పొందగా, అందులో రాము భార్య, కుమార్తె పేర్లు లేకపోవడం గమనించిన రజిత.. తన అత్తను వివరణ అడిగేందుకు అత్తగారి ఇంటికి వచ్చింది.
దీంతో అత్త, మరిది ఇంట్లోకి అనుమతించకుండా తాళాలు వేసి అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు. దీంతో రజిత తన కుమార్తె త్రిషతో కలిసి ఇంటి ముందు రాత్రి నుంచి ధర్నా చేపట్టారు. తన భర్త ఆస్తిని కాజేయాలనే ఉద్దేశ్యంతో తప్పుడు సమాచారం ఇచ్చి ఫ్యామిలీ సర్టిఫికెట్ పొందారని, తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని రజిత ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరిగే వరకు ధర్నాను విరమించేది లేదని తెలిపారు.