మైలార్‌దేవ్‌పల్లి, డిసెంబర్ 26: ఇంట్లో నిత్యం భర్త గొడవపడుతుండటంతోపాటు వేధిస్తుండడంతోనే భార్య, తన సోదరితో కలిసి ఆయనను హత్య చేసింది. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గురువారం మైలార్‌దేవ్‌పల్లి ఇన్స్పెక్టర్ నరేందర్ వివరాల ప్రకారం.. బిహార్ రాష్ర్టానికి చెందిన ముంతాజ్ ఆలం(40), రౌషన్ కటూన్ భార్యాభర్తలు. వీరు బతుకుదెరువు కోసం ఉడ్డెంగడ్డకు వచ్చి నివసిస్తున్నారు. ముంతాజ్ ఆలం స్థానింగా చికెన్ సెంటర్లో పని చేస్తున్నాడు. మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకుండా భార్యను నిత్యం చితకబాదేవాడు. ఈ విషయాన్ని రౌషన్ కటూన్.. తన అక్క రవినబీబీకి తెలిపింది. ఇద్దరు కలిసి ముంతాజ్‌ను హత్య చేయాలని పథకం పన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 20న రాత్రి ఫుల్‌గా మద్యం సేవించి వచ్చిన ముంతాజ్ ఆలంను ఇద్దరు కలిసి నవారు తాడుతో అతడి గొంతుకు బిగించి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. అనంతరం ఎవరికి అనుమానం రాకుండా నవారు తాడుతో కాళ్లు, చేతులు కట్టి ఒక సంచిలో కుక్కి.. 21న తెల్లవారుజామున గుర్తు తెలియని ఆటోలో మృతదేహాన్ని తీసుకువెళ్లి లక్ష్మీగూడ చౌరస్తా హ్యాపీ వైన్స్ ఎదురుగా ఉన్న డ్రైనేజీ కాలువలో పడేశారు. ఈ నెల 24న అక్కడ విధులు నిర్వహిస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులు రౌషన్ కటూన్తోపాటు ఆమె అక్కను అరెస్ట్ చేశారు.