కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 30 : అప్పుల బాధతో భర్తను చంపిన భార్య….తాను ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించి… దవాఖానలో చికిత్స పొందుతున్న ఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గుంటురు జిల్లా యుత్నంగి గ్రామానికి చెందిన ఆల్లే రామకృష్ణారెడ్డి(45)కి హైదరాబాద్లోని అడ్డగుట్టకు చెందిన రమ్యకృష్ణ (38)తో 2007లో వివాహమైంది. వీరు నగరంలోని కేపీహెచ్బీ కాలనీ 6వ ఫేజ్లో నివాసం ఉంటున్నారు.
రామకృష్ణారెడ్డి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ…గత కొద్ది కాలంగా పలు వ్యాపారాలు చేసి అప్పులపాలయ్యాడు. ఇటీవల హోటల్ వ్యాపారం చేసి నష్టపోయాడు. సుమారుగా రూ.50లక్షల వరకు అప్పులు కావడంతో భార్యాభర్తలు ఇంటినుంచి బయటకు వెళ్లడానికి కూడా ఇబ్బందులు పడుతూన్నారు. పెండ్లి జరిగి 18ఏండ్లు అయినా పిల్లలు కాలేదన్న బాధ ఆ దంపతులను వేధిస్తోంది.
అప్పుల బాధ ఓ వైపు… పిల్లలు కాలేదన్న బాధ మరోవైపు.. దీంతో వీరిద్దరూ చనిపోవాలని నిర్ణయించుకున్నారు. శనివారం భార్య రమ్యకృష్ణ కత్తి తీసుకుని….భర్త రామకృష్ణారెడ్డి మెడ, కడుపులో కోయగా… తీవ్ర రక్తస్రావం జరిగి మృతి చెందాడు. వెంటనే తాను కూడా మెడపై కత్తితో కోసుకుని ఇబ్బంది పడుతూ…. పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రమ్యకృష్ణను దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.