Hyderabad | చంపాపేట, జూన్ 10 : వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అపనమ్మకంతో భర్త దాసు భార్యను చున్నీతో ఉరేసి హత్య చేశాడు. సరూర్ నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి లింగోజిగూడ డివిజన్ భాగ్యనగర్ కాలనీలో ఉండే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా కొమ్మనపల్లి గ్రామానికి చెందిన మరియ దాసు(35), సరూర్ నగర్ భాగ్యనగర్ కాలనీకి చెందిన తకాడ అమ్ములుకు 2013లో వివాహం జరిగింది. అప్పటినుంచి సరూర్ నగర్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీలోనే నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు పాప మహి అశ్విని (11), బాబు(7).
ఈ దంపతులిద్దరూ కొన్నాళ్ల వరకు బాగానే ఉన్నారు. ఏమైందో తెలియదు కానీ.. గత కొంతకాలం నుంచి ఒకరిపై ఒకరు నమ్మకం కోల్పోయి అనుమానించుకోవడం ప్రారంభించారు. దీంతో వీరిద్దరూ తరచూ గొడవలు పడుతుండేవారు. ఈ క్రమంలోనే సోమవారం అర్ధరాత్రి భార్యాభర్తలిద్దరూ మరోసారి గొడవ పడ్డారు. దీంతో భర్త మరియ దాసు ఉక్రోషంతో రగిలి పోయి అమ్ములను ఎలాగైనా మట్టుబెట్టాలని పథకం పన్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇంట్లోనే ఆమెకు ఉరేశాడు. అనంతరం ఆమె తండ్రి అర్జున్‌కు సమాచారం అందించి ఇంట్లో నుంచి పరారీ అయ్యాడు.
హుటాహుటిన అమ్ములు నివాసం ఉంటున్న ఇంటి వద్దకు అర్జున్ చేరుకున్నాడు. కూతురు మృతదేహాన్ని చూసి తండ్రి బోరున విలపించాడు. ఈ ఘటనపై సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.