Wife Murder | ఎర్రగడ్డ, మార్చి 13 : వయసు మీరినా చెడు ప్రవర్తన.. తరచూ భార్యతో గొడవలు.. చివరికి భార్యపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. ఫలితంగా ఆమె ఆ దెబ్బలకు తాళలేక ప్రాణం విడిచింది. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు.. ఎస్పీఆర్ హిల్స్ రాజీవ్ గాంధీ నగర్లో నరేందర్, పద్మ(50) దంపతులు నివసిస్తున్నారు. పాల వ్యాపారం చేసుకునే వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి.
ఈ క్రమంలో బుధవారం నరేందర్, పద్మలు గొడవ పడ్డారు. సహనం కోల్పోయిన నరేందర్ భార్యపై దాడి చేశాడు. చివరికి గొంతు నులిమాడు. తీవ్ర గాయాల పాలైన పద్మ ప్రాణాలు విడిచింది. ఈ ఘటన జరిగిన కొద్దీ సేపటికి నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా నరేందర్, పద్మలు వివాహం జరిగి 25 ఇండ్లు అవుతుంది. వీళ్లకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.