మేడ్చల్, ఫిబ్రవరి 13: అనుమానాస్పదంగా మృతి చెందిన యువకుడి కేసును పోలీసులు రెండు రోజుల్లోనే ఛేదించారు. డీసీపీ కోటిరెడ్డి పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేపట్టిన ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, సీఐ సత్యనారాయణ, ఎస్సై మన్మథరావు భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్టు నిర్ధారించారు. సీసీ కెమెరాల ఫుటేజీలు, దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించి, నిందితులను పట్టుకొని, పోలీసు కస్టడీకి తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. మేడ్చల్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కొండాపూర్(ఎస్)గ్రామ పంచాయతీ పరిధిలోని గర్యా తండాకు చెందిన నునావత్ రమేశ్(26), నునావత్ లలిత(28) దంపతులు పిల్లలతో కలిసి మేడ్చల్ పట్టణానికి వలస వచ్చి కిందిబస్తీలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు.
రమేశ్ కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. ఎప్పుడు చూసినా లలిత ఫోన్లో మాట్లాడుతున్నట్టు గుర్తించిన రమేశ్ తరచూ భార్యతో గొడవ పడుతున్నాడు. దీంతో కుటుంబ పెద్దలు సర్దిచెప్పి కలిసి మెలిసి ఉండాలని చెప్పారు. అయినా లలితలో మార్పు రాలేదు. గొడవలు అలాగే కొనసాగాయి. ఈనెల 10న అద్దెకు ఉండే ఇంటి సమీపంలో కూల్చివేసిన ఇంటి ఖాళీ స్థలంలో భర్త రమేశ్ చనిపోయి ఉన్నట్టు లలిత బంధువులకు చెప్పింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుడి మెడకు టవలు ఉండటం, శరీరంపై గాయాలు ఉన్నట్టు గుర్తించారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రియుడితో కలిసి హత్య..
పోలీసులు దర్యాప్తులో లలిత తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భా వించి హత్యకు పథకం పన్నినట్టు గుర్తించారు. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం నీటూరు నర్సాపురం గ్రామానికి చెందిన రాళ్లపేట నర్సింహ(32) కిందిబస్తీలో నివాసం ఉంటున్నాడు. అతడి భార్య మూడేళ్ల కిందట మృతి చెందడంతో ఒంటిరిగా ఉంటున్నాడు. అతడితో లలితకు వివాహేతర సంబంధం ఏర్పడింది. అతడి ఇంట్లో తరుచుగా కలుస్తుండే వారు. ఎప్పుడు నర్సింహతో ఫోన్ మాట్లాడుతుండటంతో ఫోన్ బిజీగా ఉండేది. దీన్ని గుర్తించిన రమేశ్ లలితతో గొడవ పడేవాడు. దీంతో వివాహేతర సంబంధానికి అడ్డుగా మారిన భర్తను హత్య చేయాలని పథకం పన్నింది.
ఈ విషయం ప్రియుడు నర్సింహ చెప్పగా.. అతడిని చంపేందుకు ఒప్పుకున్నాడు. ఈనెల 3వ తేదీన మద్యం తాగి ఇంటికి వచ్చిన రమేశ్ గాఢ నిద్రలోకి జారుకున్నాడు. ఇదే అదనుగా భావించిన లలిత ప్రియుడికి సమాచారం ఇచ్చింది. రాత్రి 10.30 గంటల సమయంలో లలిత ఇంటికి చేరుకొని మెడలో ఉన్న టవల్‌తో బిగించగా.. లలిత అతడి వృషణాలు నలిపివేసింది. దీంతో రమేశ్ మృతి చెందాడు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక రమేశ్ మృతదేహాన్ని కిందిబస్తీలోనే ఖాళీ ప్రదేశంలో పడేసి తాగి మృతి చెందినట్టుగా నమ్మించేందుకు ప్రయత్నించారు. పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేయగా.. సీసీ ఫుటేజీ, తమకు అనుమానాల ఆధారంగా విచారణ జరిపారు. రమేశ్ మృతి కేసులో ఏ-1 భార్య లలిత, ఏ-2గా నర్సింహను గుర్తించారు. వారిద్దరికి పోలీసు కస్టడీకి తరలించారు.