Murder | వివాహేతర సంబంధానికి మరో భర్త బలయ్యాడు. బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఓ మహిళ.. మరో యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ విషయం భర్తకు తెలియడంతో ప్రియుడితో కలిసి చంపేసింది. అంతేకాకుండా ఏమీ తెలియనట్టు తానే డయల్ 100కి కాల్ చేసి మాయ చేయబోయి.. అడ్డంగా బుక్కయ్యింది. హైదరాబాద్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. నాగర్‌కర్నూలుకు చెందిన శేఖర్ (40), చిట్టి (33) భార్యాభర్తలు. వీరికి 16 ఏండ్ల క్రితం వివాహం జరిగింది. బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఈ దంపతులు సరూర్‌నగర్‌లోని కోదండరాంగనర్లో నివాసం ఉంటున్నారు. శేఖర్ డ్రైవర్ కాగా, చిట్టి ఇళ్లలో పనిచేస్తోంది. ఈ క్రమంలోనే హరీశ్ అనే యువకుడితో చిట్టి వివాహేతర సంబంధం పెట్టుకుంది. డ్రైవింగ్ పని మీద శేఖర్ బయట ప్రదేశాలకు వెళ్లినప్పుడు అతనితో సన్నిహితంగా ఉండేది. ఇటీవల ఈ విషయం శేఖర్‌కు తెలియడంతో తన భార్య చిట్టిని నిలదీశాడు. దీంతో వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్న భర్తను తప్పించాలని అనుకుంది. ఈ క్రమంలోనే ప్రియుడితో కలిసి మర్డర్‌కు ప్లాన్ చేసింది.
గురువారం రాత్రి భర్త శేఖర్ పడుకున్న తర్వాత తన ప్రియుడు హరీశ్‌ను చిట్టి ఇంటికి పిలిపించింది. అతని సాయంతో నిద్రలో ఉన్న శేఖర్‌ను హత్య చేసింది. హరీశ్ గొంతు నులుమగా.. చిట్టి డంబెల్‌తో తలపై కొట్టింది. భర్త మరణించాడని నిర్ధారించుకున్న అనంతరం ఏమీ తెలియనట్టుగా డయల్ 100కు కాల్ చేసింది. నిద్రలోనే తన భర్త చనిపోయాడని తెలిపింది. ఇంటికి వచ్చిన పోలీసులు శేఖర్ మృతదేహాన్ని గమనించారు. అనుమానంతో చిట్టిని తమదైన శైలిలో విచారించగా.. ప్రియుడితో కలిసి తానే భర్తను చంపినట్లు అంగీకరించింది. దీంతో చిట్టిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ప్రియుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.