Hyderabad | కంటోన్మెంట్, జూలై 15: కట్టుకున్న భార్యను భర్త అతి కిరాతకంగా నరికి చంపాడు. బోయిన్పల్లి సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. అమలాపురానికి చెందిన సత్యనారాయణ(52), ఝాన్సీరాణి(32) దంపతులకు ఇద్దరు సంతానం. బోయిన్పల్లి పరిధిలోని నూతన్ కాలనీలో నివాసముంటున్నారు. కొంతకాలంగా సత్యనారాయణ, ఝూన్సీకి మధ్య గొడవలు జరుగుతున్నాయి. సత్యనారాయణ పటాన్చెరులో నైట్‌డ్యూటీ చేస్తున్నాడు. కాగా, ఝాన్సీరాణి బోయిన్‌పల్లిలో ఉంటున్న తన తమ్ముడు కిరణ్ ఇంటికి నాలుగు రోజుల కిందట వచ్చింది.
శుక్రవారం సాయంత్రం అక్కడికి వచ్చిన సత్యనారాయణ తనకు నైట్ డ్యూటీ లేదని కిరణ్‌కు చెప్పాడు. కానీ తాను డ్యూటీకి వెళ్తున్నానని భార్యకు అబద్ధం చెప్పాడు. బోయిన్పల్లి నుంచి ఎక్కడికో వెళ్లి శనివారం ఉదయం తిరిగొచ్చాడు. ఆ సమయంలో కిరణ్ ఇంట్లో లేడు. ఝాన్సీ రాణి, కిరణ్ భార్య షీలా మాత్రమే ఉన్నారు. నైట్ డ్యూటీకి వెళ్లలేదని తెలుసుకున్న ఝాన్సీ రాణి.. భర్తను నిలదీసింది. అప్పటికే తన బ్యాగులో దాచి ఉంచిన కొబ్బరికాయలు కొట్టే కత్తిని బయటకు తీసిన సత్యనారాయణ.. భార్య ఝాన్సీ రాణిని నరికాడు. ఈ క్రమంలో అడ్డువచ్చిన షీలాను సైతం కత్తితో పొడవడంతో తీవ్ర గాయాలపాలైంది. భార్యను హత్య చేసిన అనంతరం సత్యనారాయణ పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు బోయిన్పల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. నిందితుడు వాడిన కత్తిని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సత్యానారాయణ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు బేగంపేట ఏసీపీ పృథ్వీధర్‌రావు తెలిపారు.